భారతీయ విద్యావిధానంపై సీనీయర్ ఐపీఎస్ అధికారి ఎం.నాగేశ్వరరావు అభిప్రాయం-
"భారతీయ నాగరికత పూర్వాపరాలు క్షుణ్నంగా తెలిసిన డాక్టర్ అంబేడ్కర్ సైతం సాంస్కృతిక పునరుజ్జీవనానికి సంస్కృతం గొప్ప సాధనం కాగలదన్నారు. కళలు, పరిపాలన, సైన్స్, సాంకేతిక, న్యాయ శాస్త్రాల బోధన, పరిశోధన, అభ్యసనాలకు, దైనందిన విధినిర్వహణకు భారత్‌లో సంస్కృతంకన్నా సముచితమైన భాష మరేదీ లేదని ఆయన గుర్తించారు. కానీ, రాజ్యాంగాన్ని సాకుగా చూపి ఆంగ్లాన్ని నిరవధికంగా కొనసాగించే అవకాశం ఉందనీ గ్రహించారు. అందుకే రాజ్యాంగ నిర్మాణ సభలో మొదట అధికార భాషగా సంస్కృతాన్ని ప్రతిపాదించినా, తరవాత ఏ ఒత్తిళ్ల వల్లనో దాన్ని విరమించుకున్నారు. ఆపై సంస్కృతాన్ని మన విద్యా విధానం నుంచి బహిష్కరించడమే మన ప్రభుత్వాల అప్రకటిత విధానంగా నడచింది.
సంస్కృతమే జనని
భారతదేశ కేంద్ర రిజర్వు పోలీసు దళం (సీఆర్పీఎఫ్) ప్రపంచంలో అతిపెద్ద పోలీసు బలగం. దేశానికే గర్వకారణమైన భద్రతా దళం. 2005లో నేను ఈ దళంలో చేరినప్పుడు అన్ని నామఫలకాల మీద ‘సీఆర్పీఎఫ్ సదా అజయ్... భారత్ మాతాకీ జై’ అని రాసి ఉండటం నన్ను ఎంతో ఆకట్టుకొంది. ఈ నినాదం అర్థం- సీఆర్పీఎఫ్‌ను ఎవరూ జయించలేరు, భారతమాతకు వందనం అని.
సంస్కృత భాష గాంభీర్యం, సొబగును శ్రావ్యంగా ఆలపించిన పద గుచ్ఛమది. సంస్కృత పదాలతో హిందీ భాషను పరిపుష్టం చేయాలని కేంద్ర ప్రభుత్వానికి 351వ రాజ్యాంగ అధికరణ నిర్దేశించింది. ‘జనని సంస్కృతము... ఎల్ల భాషలకు’ అని పెద్దలు ఎంతగా ప్రస్తుతించినా, మన విద్యాసంస్థల్లో సంస్కృత బోధన, అభ్యాసాలు జరగనంతవరకు రాజ్యాంగ లక్ష్యాన్ని సాధించలేం.
కలుషితం చేసిన మెకాలే
భారతదేశం చిరకాలంగా ఎన్నో సంక్షోభాలను చవిచూసింది. అంతర్గత యుద్ధాలు, విదేశీ దండయాత్రలను ఎదుర్కొంది. ఇన్ని కల్లోలాల మధ్య కూడా మన పూర్వులు భారతీయ నాగరికతను, పవిత్ర గ్రంథాలను, ప్రాచీన విజ్ఞానాన్ని సంరక్షించుకున్నారు. ఎన్నో అస్తిత్వ సంక్షోభాలమధ్య కూడా భారతీయతను కాపాడుకున్నారు. కానీ, గత శతాబ్ద కాలంలో మెకాలే వాదం పుణ్యమా అని అవిద్యలో, అజ్ఞానంలో కూరుకుపోయాం.
సమాచార విప్లవ యుగంలో ఇలాంటి అజ్ఞాన విస్ఫోటం సంభవించిందంటే కారణం- బ్రిటిష్ వలస పాలకులు... ముఖ్యంగా మెకాలే ప్రవేశపెట్టిన విద్యా విధానమే. మెకాలే విధానం ప్రాచీన భారతీయ విద్యా సంప్రదాయాలూ, సంస్కృతిని, స్థానిక వృత్తుల అభ్యసనాన్ని, మన శాస్త్రసాంకేతిక రీతుల్ని ధ్వంసం చేసింది.
బ్రిటిష్‌వారు భౌతికంగా ఈ గడ్డను తమ వలసగా మార్చుకుంటే, వారు ప్రవేశపెట్టిన మెకాలే విద్యా విధానం- భారతీయ మనసుల్లో పాగా వేసింది. మన మస్తిష్కాలనే తన వలస రాజ్యంగా మార్చుకుంది. ఈ విధంగా వలస పాలకులు భారతీయులను సమష్టిగా అవిద్యలోకి నెట్టారు. మన ప్రాచీన బోధన, అభ్యాస పద్ధతులను, బోధనాంశాలనూ నాశనం చేయడమే ధ్యేయంగా పనిచేశారు. అందుకోసమే మెకాలే విధానం తీసుకొచ్చారు. మన సంస్కృతి గొప్పదనాన్ని మనమే విస్మరించేట్లు చేయడం వారి లక్ష్యం. దురదృష్టవశాత్తూ భారతీయులు ఈ వాస్తవాన్ని గమనించలేకపోయారు.
బహిష్కరించి గర్వపడుతున్నాం..
భారతదేశ నాగరికత మొదటినుంచీ విజ్ఞానాధారితమే. వందల సంవత్సరాల నుంచి అనేకానేక అంశాలపై సంస్కృతంలో అపార విజ్ఞాన, సాహిత్య భాండాగారాన్ని ప్రోది చేసుకున్నాం. మన రుగ్వేదం ప్రపంచంలోనే అతి ప్రాచీనమైనది. మన మహా భారతం ప్రపంచంలోనే సుదీర్ఘ పద్యం. భారతీయ గ్రంథాలు, రచనల విశిష్టత కేవలం వాటి ప్రాచీనతలోనే ఉందనుకుంటే పొరపాటు. వాటిలోని అంతర్‌దృష్టి, అమూల్య విజ్ఞానం, లోతైన అవగాహన, విశాల ప్రాతిపదిక తిరుగులేనివి. అలాంటప్పుడు భారతీయ బాలబాలికలకు వేదాలు, రామాయణ, మహా భారతాలు, కౌటిల్యుడి అర్థ శాస్త్రం, పంచతంత్ర కథలను ఎందుకు బోధించడం లేదో అర్థం కాదు. వలస పాలకులపుణ్యమా అని వాటిని మన విద్యా విధానం నుంచి బహిష్కరించాం. ఇలాంటిది మరే దేశంలోనైనా జరిగితే- దాన్ని జాతికే సిగ్గుచేటుగా, నాగరికతకు ద్రోహంగా పరిగణించేవారు. భారత్‌లో మాత్రం ఈ పనిని ఆధునికతకు చిహ్నంగా, గర్వకారణంగా పరిగణిస్తారని చెప్పడానికి ఎంతో చింతిస్తున్నాను.
రాజ్యాంగంలో విద్య
భారత రాజ్యాంగంలో కొత్తగా పొందుపరచిన 21-ఏ అధికరణం ద్వారా విద్యను ప్రాథమిక హక్కుగా ప్రకటించారు. ఈ అధికరణ మెకాలేవాదం వల్ల వాటిల్లిన ముప్పును పట్టించుకోలేదు. దేశమంతటా తామర తంపరగా వెలసిన ఆంగ్ల మాధ్యమ విద్యాలయాలు మాతృభాషలో నిరక్షరాస్యత ప్రబలడానికి కారణభూతమవుతున్నాయి. మన సంస్కృతీ మూలాలను మొదటి నుంచీ రకరకాలుగా పెకలించడం జరుగుతోంది. క్రైస్తవ మత ప్రచార సంస్థలు ప్రారంభించిన విద్యాసంస్థల గురించి స్వామి వివేకానంద శతాబ్దం క్రితమే ఇలా వ్యాఖ్యానించారు- ‘ఈ పాఠశాలల్లో చేరిన విద్యార్థికి మొట్టమొదట నేర్పే అంశమేమంటే... నీ తండ్రి తెలివితక్కువవాడని. నీ తాతగారు మతిలేనివాడని. విద్యార్థికి నేర్పే మూడో అంశమేమంటే నీ భారతీయ గురువులందరూ కపటులని. చివరగా నూరిపోసేది- మన పవిత్ర గ్రంథాలన్నీ పరమ అసత్యాలని’.
ఆ రోజుల్లో ఈ విధంగా మనసులు కలుషితమైనవారి మనవలు, మునిమనవలు ఇప్పటికీ పరాయివాళ్లు విధించిన మానసిక దాస్య శృంఖలాల నుంచి బయటపడలేకపోతున్నారు. వలస విద్యావిధానం తెచ్చిపెట్టే ముప్పును విఖ్యాత తత్వవేత్త ఆనంద కుమారస్వామి ఆనాడే హెచ్చరించారు. ఆంగ్లేయ విద్యా విధానంలో ఒక్క తరం తయారైతే చాలు- ఘనమైన భారతీయ సంప్రదాయ పరంపర విచ్ఛిన్నమైపోతుంది. ఆ తరానికి తమ మూలాలతో బంధం తెగిపోయి అనామకులుగా తయారవుతారు. మిడిమిడి జ్ఞానంతో నెట్టుకొచ్చే బాపతుగా మారిపోతారు. ప్రాక్పశ్చిమాలు, గతం, భవిష్యత్తుల్లో దేనికీ చెందనివారిగా మిగిలిపోతారు. ఫలితంగా భారత జాతి తన ఉజ్జ్వల ఆధ్యాత్మిక వారసత్వాన్ని కోల్పోతుంది. ఇంతకన్నా ఘోరం మరొకటి ఉండదు. భారత్ ఎదుర్కొంటున్న ప్రమాదాలన్నింటిలోకీ విద్యా వ్యవస్థకు ఎదురవుతున్న ముప్పే అత్యంత జటిలమైనది, విషాదకరమైనదని కుమారస్వామి అన్నారు.
గాంధీ మాట
మహాత్మా గాంధీ కూడా బ్రిటిష్‌వారు మన సంప్రదాయ విద్యావ్యవస్థను నాశనం చేసిన తీరును 1931 అక్టోబరు 20న కళ్లకు కట్టినట్లు వర్ణించారు.
‘బ్రిటిష్‌వారు రావడానికి 50 లేదా 100 ఏళ్లకు ముందునాటితో పోలిస్తే ఇవాళ భారతీయుల్లో నిరక్షరాస్యుల సంఖ్య చాలాచాలా ఎక్కువ. దీన్ని కాదనే దమ్ము ఎవరికైనా ఉందా అని అడుగుతున్నాను. బర్మా పరిస్థితీ ఇంతే. బ్రిటిష్ పాలకులు వచ్చాక ఇక్కడి విద్యాసాంస్కృతిక వృక్షాన్ని పెకలించడం మొదలుపెట్టారు. మట్టిని పెళ్లగించి వేర్లు పీకి వదలివేయడంతో అందమైన వృక్షం కాస్తా అంతరించిపోయింది’- అని గాంధీజీ చేసిన ఈ వ్యాఖ్యలే ఆయన అనుయాయుడు ధర్మపాల్‌ను ‘ది బ్యూటిఫుల్ ట్రీ’ అనే గ్రంథ రచనకు పురిగొల్పాయి.
బ్రిటిష్ వలస పాలనకు ముందు భారతీయ విద్యా వ్యవస్థ ఎలా ఉండేదో అందులో ఏకరువు పెట్టారు.
పరోక్షంగా అంగీకారం
భాషా విధానం ఎలా ఉండాలనేదానిపై రాజ్యాంగ నిర్మాణ సభ జరిపిన చర్చలను పరికిస్తే మనం ఈ దుస్థితిలోకి ఎందుకు, ఎలా జారిపోయామో అవగతమవుతుంది. సంస్కృతాన్ని అధికార భాషగా చేయాలని ప్రతిపాదించిన పండిత లక్ష్మీకాంత మైత్రా వ్యాఖ్యలు ఇక్కడ గమనార్హం.
‘మన పురా వైభవాన్ని, సంస్కృతీ నాగరికతల గొప్పదనాన్ని మీరంతా మరచిపోయారు. మన సాహితీ సౌరభాన్ని, సారాన్ని గ్రహించలేక ఎండమావుల వెంట పడుతున్నారు. భారతదేశంలో సంస్కృతాన్ని కాదని ఎవరూ ముందుకెళ్లలేరు. హిందీని రాజభాషగా చేయాలంటూనే, అది తన పద సంపదను సంస్కృతం నుంచి అరువు తెచ్చుకోకతప్పదని అంగీకరిస్తున్నారు. ఈ విధంగా మీ అశక్తతను, నిస్సహాయతను ఆమోదిస్తూ అధికార భాషగా సంస్కృతమే శరణ్యమని పరోక్షంగా ఒప్పుకొంటున్నారు. జనని సంస్కృతం నుంచి పోషణ లేక హిందీ తదితర భారతీయ భాషలు కృశించిపోయాయి. భారత సంస్కృతీనాగరికతలకు పునాది అయిన సంస్కృతం అర్ధ శతాబ్దిలోనే కనుమరుగైంది. ఇదేకాలంలో ఇజ్రాయెల్ అమ్మ భాష హీబ్రూకు మళ్ళీ కొత్త జవజీవాలు అందించి పరిపుష్టం చేసింది.
అదే భారతదేశంలో హిందీ పేరుకే అధికార భాష కాని- పార్లమెంటు, న్యాయ వ్యవహారాలన్నింటికీ ఆంగ్లాన్ని అధికారికంగా ఉపయోగిస్తున్నారు. బిడ్డ చనిపోయినా పురుటి వాసన పోనట్లు వలస పాలన అంతరించినా ఆంగ్లం మనల్ని వదలిపోవడం లేదు.
మహాత్మా గాంధీ 150వ జయంతిని ఇటీవలే జరుపుకొన్నాం. ఈ సందర్భంగా విద్యా విధానంపై ఆయన పలుకులను స్మరణకు తెచ్చుకుని అవిద్య, అజ్ఞానాలను పారదోలదాం. సంస్కృతం, దాని బిడ్డలైన భారతీయ భాషలను పటిష్ఠపరచుకుని, ఆ పునాదిపై ఆధునిక యుగానికి కావలసిన విద్యా విధానాన్ని నిర్మించుకుని అనుసరిద్దాం. మన సంస్కృతీ నాగరికతలను సంరక్షించుకుందాం. మహాత్ముడి బోధలను మనసా వాచా కర్మణా ఆచరిద్దాం! "