జమ్ముకశ్మీర్‌లో పరిస్థితులను అంచనా వేయటానికి ఆ రాష్ట్రంలో పర్యటించడానికి ప్రయత్నించిన విపక్షాలను శ్రీనగర్ విమానాశ్రయంలో ప్రభుత్వం అడ్డుకుంది. అక్కడ నుంచి నేరుగా దిల్లీకి పంపించివేసింది. ఈ చర్యలపై విపక్షాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. పరిస్థితులు సాధారణంగా ఉన్నప్పుడు అడ్డగించడం ఎందుకని ప్రశ్నించాయి.
ఖండించిన రాహుల్...
జమ్ముకశ్మీర్‌లో తమను అడ్డుకోవటాన్ని చూస్తే....అక్కడ పరిస్థితులు సరిగ్గా లేవన్న విషయం అవగతమవుతోందని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. గవర్నర్ ఆహ్వానం మేరకే ఇతర పార్టీల నేతలతో కలిసి తాను శ్రీనగర్ వెళితే తిప్పి పంపారన్నారు.
ఈ చర్యను ప్రజాస్వామ్య, రాజ్యాంగ వ్యతిరేకమని రాహుల్ బృందం బుడ్‌గావ్ మేజిస్ట్రేట్‌కు రాసిన లేఖలో విమర్శించింది.
సమర్థించుకున్న సర్కారు...
రాష్ట్రంలో పరిస్థితులు సద్దుమణుగుతున్న వేళ నేతల పర్యటనతో ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉందని గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
"ఇప్పుడు వాళ్లు రావాల్సిన అవసరం లేదు. వాళ్ల నేతలు పార్లమెంటులో మాట్లాడినప్పుడు రావాల్సింది. ఇప్పుడిప్పుడే ఇక్కడ సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. మేం ప్రయత్నిస్తున్నాం. మేం ప్రజలకు అర్థమయ్యేలా చెబుతున్నాం. కశ్మీర్ ప్రజలను రెచ్చగొట్టేలా దిల్లీలో అబద్దాలు చెప్పారు. ఇప్పుడు ఇక్కడి వచ్చి చెబుతున్నారు. ఇది సరైన విషయం కాదు. నేను నిజాయతీగా పిలిచాను. కానీ వాళ్లు రాజకీయాలు చేయడానికి వచ్చారు. రాజకీయ చర్య తప్ప ఇందులో ఏమీ లేదు. పార్టీలన్నీ దేశ అవసరాలకు తగినట్లు పనిచేయాలి."
-సత్యపాల్ మాలిక్, జమ్ముకశ్మీర్ గవర్నర్
కశ్మీర్‌లో పరిస్థితులను తెలుసుకునేందుకు లోయలో పర్యటించాలని ఓ సందర్భంలో గవర్నర్ సత్యపాల్ కోరగా.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అందుకు అంగీకరించిన విషయం తెలిసిందే.
మళ్లీ ఆంక్షలు....
శ్రీనగర్ శివార్లలోని సౌరా వద్ద శుక్రవారం ప్రార్థనలు ముగిసిన తరవాత సుమారు 300 మంది నిరసనలకు దిగారు. వారిపై బలగాలు స్వల్ప లాఠీఛార్జి చేసి చెదరగొట్టిన విషయం తెలిసిందే. ఐక్య రాజ్య సమితి మిలటరీ పరిశీలక బృందం అధికారి కార్యాలయం వరకూ వచ్చి నిరసనలు తెలపాలని వేర్పాటువాదులు గోడపత్రికలు అంటించారు. అప్రమత్తమైన అధికారులు శ్రీనగర్ సహా లోయలోని ఇతర ప్రాంతాల్లోనూ తిరిగి ఆంక్షలను విధించారు.
ఇదీ చూడండి: అమానుషం: విరిగిన కాళ్లను తలగడలా వాడిన వైద్యులు