ప్రస్తుతం ఉల్లి తీవ్ర ధరాఘాతాలతో బెంబేలెత్తుతున్న కోట్లాది వినియోగదారుల్ని, ఖరీఫ్ దిగుబడులపై వాతావరణ పర్యవేక్షక సంస్థ 'స్కైమెట్' అంచనాలు హడలెత్తిస్తున్నాయి. నైరుతి రుతుపవనాల వేళ పోటెత్తిన భారీ వర్షాలు, భీకర వరదల మూలాన పలు పంటలకు పెద్దయెత్తున నష్టం వాటిల్లిందన్న వివరణాత్మక విశ్లేషణలు తాజాగా వెలుగుచూశాయి. పన్నెండు రాష్ట్రాల్లోని 137 ప్రభావిత జిల్లాల్లో 32 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలోని సేద్యభూములు ఇటీవల ప్రకృతి ప్రకోపానికి గురైనట్లు 'స్కైమెట్' మదింపు వేసింది. కుంభవృష్టి, వరదల కారణంగా వరి, నూనె గింజలు, పప్పుధాన్యాల దిగుబడి 12 శాతందాకా కుంగిపోనుందని అది లెక్కకట్టింది. వాస్తవానికి రెండు వారాలక్రితం కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ 15 రాష్ట్రాల్లోని 64 లక్షల హెక్టార్లదాకా విస్తీర్ణం ముంపు బారిన పడిందంటూ మరింత ఆందోళనకర దృశ్యాన్ని ఆవిష్కరించింది.
పప్పుధాన్యాలు, నూనెగింజల దిగుబడులు తెగ్గోసుకుపోనున్నాయన్న సూచనల నేపథ్యంలో ఈసరికే రంగంలోకి దూకాల్సిన ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. అక్టోబరుతో మొదలై ఫిబ్రవరిలో ముగిసే సీజన్‌లో ప్రధానమంత్రి అన్నదాత ఆయ్ సంరక్షణ్ అభియాన్ (పీఎం- ఆశా) కింద 37.59 లక్షల మెట్రిక్ టన్నుల మేర పప్పుధాన్యాలు, నూనెగింజలను సేకరించాలని లక్ష్యం నిర్దేశించుకున్నారు. రెండు నెలలు గడిచిపోయాయి, ఇప్పటివరకు సమీకరించిన మొత్తం సుమారు లక్ష టన్నులే (మూడు శాతంలోపు). యూపీ, మధ్యప్రదేశ్, ఒడిశా వంటి రాష్ట్రాల్లో సేకరణ క్రతువు ఆరంభమే కాలేదు! ఏవైనా సేద్య ఉత్పత్తుల దిగుబడి కుంగినప్పుడు- సరఫరా, గిరాకీల మధ్య అంతరం పెరగనుందనడమే తరువాయి.. విపణిశక్తుల చేతివాటం జతపడి ధరలకు రెక్కలు మొలుచుకురావడం చూస్తూనే ఉన్నాం. అటువంటి పరిస్థితిని పునరావృతం కానివ్వకుండా తగినన్ని నిల్వలు సిద్ధంగా ఉంచాల్సిన ప్రభుత్వంలో ఇకనైనా చురుకు పుట్టాలి!
విశ్వవ్యాప్తంగా పప్పుధాన్యాల ఉత్పత్తిలో 25శాతం వాటా భారత్‌దే అయినా, పండించేది దేశీయ వినియోగానికే సరిపోక తరచూ విదేశీ దిగుమతుల వైపు చూడాల్సి వస్తోంది. ప్రధాన పంటల విస్తీర్ణంలో 12-15 శాతం వరకు నూనెగింజల కింద లెక్క తేలుతున్నప్పటికీ, వెలుపలినుంచి వంట నూనెలు తెప్పించుకోక తప్పడంలేదు. ఈ పరాధీనతను చెల్లాచెదురు చేసేందుకంటూ జాతీయ వ్యవసాయ వ్యయ ధరల నిర్ధారణ సంఘం (సీఏసీపీ) ఏడేళ్లక్రితమే దీర్ఘకాలిక వ్యూహాన్నొకదాన్ని ప్రతిపాదించింది. వంటనూనెల పరంగా స్వావలంబనకు ఉద్దేశించి చేసిన సిఫార్సుల్ని నాటి యూపీఏ సర్కారు పేరబెట్టింది. పప్పుల సాగు పెంపుదలకోసం ప్రోత్సాహకాలు, మద్దతు ధర తదితర అంశాల పరిశీలనకు ఏర్పాటైన ప్రత్యేక కమిటీ సైతం చాపచుట్టేసింది.
సాగుదారులకు కొండంత అండగా నిలుస్తుందన్న ప్రచారంతో నిరుడు సెప్టెంబరులో ‘పీఎం-ఆశా’ పట్టాలకు ఎక్కింది. అంతకు నాలుగు నెలల ముందు గణాంకాల ప్రకారం, ప్రభుత్వం 25 లక్షల టన్నులకుపైగా పప్పు ధాన్యాలు, నూనెగింజలు సమీకరించగలిగింది. అప్పట్లో నిర్దేశించుకున్న 33.6 లక్షల టన్నుల సేకరణ లక్ష్యంలో అది 75శాతం. నాడు మందకొడిగా వ్యవహరిస్తున్నదంటూ ఘాటు విమర్శలు ఎదుర్కొన్న నాఫెడ్ (జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్ సమాఖ్య) ఈసారి పూర్తిగా ముణగదీసుకున్న తీరు విస్మయపరుస్తోంది. ‘పీఎం-ఆశా’ అమలుకు రెండేళ్లలో రూ.15,053 కోట్ల బడ్జెట్ కేటాయించిన కేంద్రం, సేకరణ ఏజెన్సీలకు రూ.16,550 కోట్ల మేర అదనపు రుణ గ్యారంటీని ప్రసాదించినా- క్షేత్ర స్థాయిలో స్తబ్ధత రాజ్యమేలుతోంది. పప్పులు, వంటనూనెలకు సంబంధించీ జనం చేతిచమురు వదిలే దురవస్థ దాపురించకుండా ప్రభుత్వం సత్వర దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సి ఉంది!
ఆపత్కాలంలో అక్కరకొచ్చేలా తగినన్ని నిల్వల సమీకరణ యత్నాలతోనే పప్పులు, వంటనూనెల పద్దులో దేశానికి స్వావలంబన సాధ్యపడదు. సాగుబడిలో నైపుణ్య పాఠాలు ఒంటపట్టించుకుని సస్య విప్లవ జాతీయ వ్యూహాన్ని సమర్థంగా అమలు పరచడం భారత్‌కు అత్యావశ్యకమిప్పుడు. మనకన్నా చైనా రెండింతలకు పైగా పత్తి, అమెరికా తొమ్మిది రెట్ల మొక్కజొన్న దిగుబడి సాధిస్తున్నాయి. వేరుశనగ, పొద్దు తిరుగుడు, నువ్వులు, ఆవాలు... ఏ రకం నూనె పంటల ఉత్పాదకత పరిశీలించినా అమెరికా, చైనా, బ్రిటన్, ఆస్ట్రేలియాల సరసన ఇండియా చిన్నబోతోంది. ఇతర దేశాలు వివిధ పంటల దిగుబడిని ఇనుమడింపజేయడానికి పరిశ్రమిస్తుండగా- సేద్య భారతాన దిగ్భ్రాంతకర విషాద ఘట్టాల పరపర కొనసాగుతోంది. ఇక్కడ ఏదైనా పంట దిగుబడి పెరిగితే రైతు బతుకు బండి అమాంతం కుంగిపోతుంది. ఏ కారణంగానైనా సరఫరాలు తగ్గితే ఉన్న నిల్వల్ని బిగపట్టి అందినకాడికి విపరీత లాభాలు దండుకునే దళారులు, వ్యాపారుల పంట పండుతుంది. విరగపండినప్పుడూ పండగ చేసుకోలేని దయనీయ దుస్థితిలో రైతుల్ని నిలువునా ముంచేస్తున్న దేశం మనది. విశేష దిగుబడులు వచ్చినప్పుడు ఆ మేరకు రైతాంగానికి లబ్ధి చేకూర్చేలా విదేశాలకు ఎగుమతి చేసే అవకాశాల్ని ప్రభుత్వమే కల్పించాలి. ఏ కారణంగానైనా ఫలానా పంట దెబ్బ తినబోతున్నదన్న సంకేతాలు పసిగట్టగానే వెలుపలినుంచి దిగుమతుల్ని రప్పించే వ్యవస్థాగత ఏర్పాట్లు, ముందస్తు ఒడంబడికలు- వినియోగదారులకు ధరా సంక్షోభం పీడను విరగడ చేస్తాయి. అన్నిరకాల పంటలపైనా సర్వసమగ్ర ప్రణాళికలతో పకడ్బందీ దిద్దుబాటు చర్యలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నడుం బిగిస్తేనే- పొలాలతో పాటు దేశార్థికమూ పచ్చగా ఉంటుంది. రైతు శ్రమ అణుమాత్రమైనా వ్యర్థం కానివ్వని విప్లవాత్మక సంస్కరణలతోనే జాతికి ఆహార భద్రత సమకూరుతుంది!
ఇదీ చూడండి:'ఐపీసీ, సీఆర్పీసీల సవరణకు సూచనలివ్వండి'