కరోనా వైరస్ నివారణకు పలు రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యలపై ప్రశంసలు కురిపించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, రేపు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ట్విట్టర్లో పేర్కొంది. వైరస్‌ను ఎదుర్కోవడానికి మోదీ మరిన్ని సూచనలు చేసే అవకాశం ఉంది.
జాతినుద్దేశించి రేపు రాత్రి 8 గంటలకు ప్రసంగించనున్నారు. ఇదిలా ఉంటే మోదీ నేతృత్వంలో కరోనాపై ఉన్నత స్థాయి సమావేశం జరిగినట్లు, అందులో వైరస్ నివారణకు తీసుకునే చర్యలపై సమీక్షించినట్లు ప్రధాని కార్యాలయం తెలిపింది.
ప్రధాని ప్రశంసలు!
కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడంలో భాగస్వాములవుతున్న వారిని మోదీ ప్రశంసించారు. విదేశాల నుంచి వచ్చే ప్రజల కోసం ఏర్పాటు చేసిన ప్రభుత్వ పోర్టల్‌లో తన సోదరి వివరాలను పొందుపరిచిన ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ను ప్రధాని ప్రత్యేకంగా అభినందించారు. బృందాలుగా ఏర్పడి వైరస్ నివారణలో అందరు భాగంగా కావాలని, అప్పడే మహమ్మారిని అదుపు చేయడం సాధ్యమవుతుందన్నారు. మెరుగైన ఫలితాల కోసం కృషి చేయాలని పరిశోధకులు, ఆవిష్కర్తలు, టెక్ ప్రియులను ప్రధాని కోరారు.
రాహుల్ విమర్శలు..
కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించటంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్రం విఫలమైందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. రాహుల్ ట్విట్టర్ వేదికగా మోదీ ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. కేంద్రం నిర్ణయాత్మకంగా వ్యవహరించకపోవటం వల్ల దేశం భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. కరోనా వైరస్‌ను నివారించేందుకు సత్వర చర్యలు తీసుకోవాలన్నారు రాహుల్ గాంధీ.
ఇదీ చూడండి: 'ఇకపై డీటీహెచ్ ఛానెళ్లలో ఆన్లైన్ తరగతులు'