దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో ఎంపీల్యాడ్స్ నిధుల ద్వారా పార్లమెంటు సభ్యులు తమవంతు ఆర్థిక సాయం చేసేందుకు మార్గం మరింత సుగమమైంది. ఈ మేరకు ఎంపీ స్థానిక ప్రాంత అభివృద్ధి పథకం(ఎంపీఎల్ఏడీ) నిధుల వినియోగం నిబంధనల్లో పలు సవరణలు చేసింది ప్రభుత్వం. కరోనా వైద్య పరీక్షలతో పాటు ఇతర అవసరాల కోసం ఈ నిధులు వినియోగించేలా చూడాలన్న ఎంపీల వినతి మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీకి కృతజ్ఞతలు తెలిపారు పలువురు ఎంపీలు.
" కరోనా నియంత్రణ కోసం ఎంపీల్యాడ్స్ పథకం నిబంధనలను సడలించాలన్న మా అభ్యర్ధనకు స్పందించిన కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్రమోదీకి కృతజ్ఞతలు. ఎంపీల్యాడ్స్ నిబంధనలను సడలించటం ద్వారా వైరస్ నియంత్రణకు ఉపయోగపడే మాస్క్లు, శానిటైజర్లు, ఇతర వైద్య పరికరాలు కొని ప్రజలకు అందించవచ్చు."
-వివేక్ తంఖా, కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు.
ప్రధానికి లేఖ..
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలకు మాస్క్లు, ఇతర వైద్య పరికరాలు ఎంతో అవసరమైనందున తమకు కేటాయించిన ఎంపీల్యాడ్స్ నిధులను వినియోగించేందుకు అనుమతివ్వాలని కోరుతూ ప్రధానికి లేఖ రాశారు ఎంపీ వివేక్. ఈ లేఖపై సానుకూలంగా స్పందించింది కేంద్రం.
ఇవి మాత్రమే
మాస్క్లు, శానిటైజర్లు, వైరస్ నిర్ధరణ కిట్లు, థర్మల్ స్కానర్లు, విమానాశ్రయం, రైల్వేస్టేషన్లలో ఏర్పాటు చేయటానికి కావలసిన కెమెరాలు, ఇతర వైద్య పరికరాల కొనగోలుకు మాత్రమే ఎంపీల్యాడ్స్ పథకం నుంచి నిధులను ఉపయోగించుకోవాలని స్పష్టం చేసింది కేంద్రం.
ఇదీ చూడండి: అయోధ్య రామ మందిర నిర్మాణంలో మరో అడుగు