కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం(డిసెంబర్ 28) రోజున భారీ స్థాయిలో ర్యాలీలకు ప్రణాళికలు రచిస్తోంది. నరేంద్రమోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా "సేవ్ ఇండియా-సేవ్ కాన్స్టిట్యూషన్" పేరిట అన్ని రాష్ట్రాల రాజధానుల్లో ఈ ర్యాలీలు నిర్వహించనున్నట్లు హస్తం పార్టీ స్పష్టం చేసింది.
డిసెంబర్ 14న దిల్లీలో జరిగిన 'భారత్ బచావో' ర్యాలీ విజయోత్సాహంతో వరుస ర్యాలీలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వెల్లడించారు.
"నరేంద్రమోదీ, అమిత్ షా సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజావ్యతిరేక నిర్ణయాలు.. దేశంలో నిరుద్యోగం, ఆర్థిక మందగమనం, ధరల పెరుగుదల, మహిళలపై వేధింపులకు దారి తీస్తున్నాయి. కేంద్రం నిర్ణయాలను వ్యతిరేకిస్తూ.. బలమైన నిరసనలు తెలపడమే ఈ ర్యాలీల ప్రధాన లక్ష్యం."-కేసీ వేణుగోపాల్, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి
సోనియా గాంధీ నుంచి...
డిసెంబర్ 28న ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో పార్టీ అధినేత్రి సోనియా గాంధీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. అదే సమయంలో రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, ఇంఛార్జ్లు, ముఖ్య నేతలు ఆయా రాష్ట్రాల్లో ఏర్పాటు చేసే ర్యాలీల్లో పాల్గొననున్నట్లు సమాచారం. పీసీసీ కార్యదర్శుల ఆధ్వర్యంలో రాష్ట్రాల్లో ర్యాలీలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: అత్యాచార దోషికి 17 రోజుల్లోనే శిక్ష విధించిన కోర్టు