ఎన్నికల్లో విజయం కోసం కాంగ్రెస్ పార్టీ ఆర్ఎస్ఎస్ సాయం తీసుకుంటోందని పశ్చిమ్ బంగ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఆరోపించారు.
గతేడాది నాగ్‌పుర్‌లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంలో ఓ కార్యక్రమానికి మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హాజరైన విషయాన్ని గుర్తుచేశారు దీదీ. జాంగిపుర్ కాంగ్రెస్ అభ్యర్థి, ప్రణబ్ కుమారుడు.. అభిజిత్ ముఖర్జీ కోసం ఆర్ఎస్ఎస్ ప్రచారం నిర్వహిస్తోందని ఆరోపించారు.
ముర్షిదాబాద్ జిల్లా బెల్దాంగలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన మమత బెనర్జీ కాంగ్రెస్, భాజపా, లెఫ్ట్ పార్టీల జట్టును ఓడించాలని ప్రజలను కోరారు.
" బహరాంపోర్ కాంగ్రెస్ అభ్యర్థి అధిర్ చౌధరి భాజపా, లెఫ్ట్ సాయంతో విజయం సాధించాలని వ్యూహాలు పన్నుతున్నారు. కానీ ఈ సారి అది ఫలించదు. ఆ పార్టీ వ్యక్తికి ప్రజలు ఓటు వేయకూడదు జాంగిపుర్లో అభిజిత్ ముఖర్జీ, బహరాంపోర్లో అధిర్ చౌదరి కోసం ఆర్ఎస్ఎస్ ప్రచారం చేపడుతోంది. సీపీఎం.. భాజపాకు అమ్ముడుపోయింది."
- మమత బెనర్జీ, పశ్చిమ్ బంగ ముఖ్యమంత్రి
బహరాంపోర్ నుంచి తృణమూల్ అభ్యర్థి అపూర్బ సర్కార్ (డేవిడ్) బరిలో ఉన్నారు. కాంగ్రెస్, భాజపా, లెఫ్ట్ పార్టీల వ్యూహాలకు బంగాల్ ప్రజలు సరైన సమాధానం చెబుతారని పేర్కొన్నారు మమత. పశ్చిమ్ బంగలోని 42 సీట్లును తృణమూల్ కాంగ్రెస్సే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ఎన్నికల ప్రచారంలో భాజపాపైనా విరుచుకుపడ్డారు దీదీ. మతం ప్రాతిపదికన ప్రజలను విడదీస్తోందని ఆరోపించారు. బెంగాల్లో ఎన్ఆర్సీని అనుమతించబోమని స్పష్టం చేశారు. సాయుధ దళాలను ప్రధాని మోదీ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని ఆరోపించారు.