ఎన్నికల్లో ఓట్లు పొందడానికి సాయుధ దళాలపై రాజకీయాలు చేస్తున్నారంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షాపై ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది.
అభిషేక్ సింఘ్వీ, రణ్‌దీప్ సింగ్ సుర్జేవాలా సహా పలువురు కాంగ్రెస్ నేతలు ఎన్నికల సంఘాన్ని కలిశారు. అమేఠీ స్థానం నుంచి పోటీచేస్తున్న కేంద్రమంత్రి స్మృతి ఇరానీ తన విద్యార్హతపై నామినేషన్లో తప్పుడు సమాచారం అందించారని ఆరోపించారు. ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హురాలిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
" బాలాకోట్ విషయంలో ప్రధాని మోదీ, అమిత్ షా, ఇతర భాజపా నేతలు సాయుధ దళాలపై రాజకీయం చేస్తున్నారు. ఇది 70 ఏళ్ల స్వతంత్ర భారతంలో మొదటి సారి. సైనిక చర్యలను ప్రతిరోజు రాజకీయాల్లోకి లాగుతున్నారు. దీనిపై రాజకీయం చేస్తూ ఓటు అడగడం ప్రధాని మోదీ, అమిత్ షాలకే సాధ్యం." - అభిషేక్ మను సింఘ్వీ, కాంగ్రెస్ ప్రతినిధి
ప్రవర్తనా నియామవళిని ఉల్లంఘించిన వారిని మందలించటమే కాకుండా తగిన చర్యలు చేపట్టి ప్రచారాలలో పాల్గొనకుండా చూడాలని ఈసీకి విజ్ఞప్తి చేసినట్టు కాంగ్రెస్ నేతలు తెలిపారు. ప్రధాని మోదీ వెబ్ సిరీస్‌నూ నిలిపివేయాలని కోరినట్లు తెలిపారు.