హాథ్రస్ ఘటనపై దేశ రాజధాని దిల్లీలో నిరసనలు భగ్గుమన్నాయి. వివిధ పార్టీల నేతలు రోడ్లపైకి వచ్చి తమ నిరసనలు తెలిపారు. ఈ నేపథ్యంలో.. జంతర్‌మంతర్ వద్ద జరిగిన నిరసనల్లో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పాల్గొన్నారు.
"హాథ్రస్ ఘటనను రాజకీయం చేయవద్దు. ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ముంబయి, దిల్లీలో ఇలాంటి సంఘటన ఎందుకు జరుగుతున్నాయి? దేశంలో అత్యాచార సంఘటనలు జరగకూడదు.
నిందితులను కఠినంగా శిక్షించాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో బాధితురాలి కుటుంబానికి సాయం చేయాలి. కానీ నేరస్థులను రక్షించాలి కొంతమంది ప్రయత్నిస్తున్నారు."
-అరవింద్ కేజ్రీవాల్
ఘటనపై వామపక్షాల ఆగ్రహం
సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ నేత డీ రాజా దిల్లీ ఆందోళనల్లో పాల్గొన్నారు. హాథ్రస్ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఏచూరి.. యూపీ ప్రభుత్వానికి అధికారంలో ఉండే హక్కు లేదని, బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలనేదే తమ డిమాండ్ అని పేర్కొన్నారు.
ఆందోళనల్లో పాల్గొన్న భీమ్ ఆర్మీ అధినేత చంద్రశేఖర్ ఆజాద్... ఉత్తర్‌ప్రదేశ్ సీఎం రాజీమానా చేయాలని డిమాండ్ చేశారు. హాథ్రస్ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
"బాధితురాలి కుటుంబానికి న్యాయం జరిగే వరకు మా పోరాటం కొనసాగుతుంది. ఈ సంఘటనపై సుప్రీం కోర్టు విచారణ జరపాలి."
- చంద్రశేఖర్ ఆజాద్
బాధితురాలు కుటుంబానికి న్యాయం చేయాలని గాంధీ వేషాధారణలో యువజన కాంగ్రెస్ సభ్యులు జంతర్‌మంతర్ రోడ్డులో ర్యాలీలు చేపట్టారు.
ఇదీ చూడండి: 'హాథ్రస్లో యోగి ప్రభుత్వం క్రూరంగా ప్రవర్తిస్తోంది'