కరోనాకు రష్యా తయారు చేసిన స్పుత్నిక్ వీ టీకాను 17 మంది వలంటీర్లపై ప్రయోగించినట్లు వైద్యులు తెలిపారు. పుణెలోని నోబుల్ ఆస్పత్రిలో ఈ ట్రయల్స్ చేపట్టినట్లు వెల్లడించారు. వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించనున్నట్లు చెప్పారు.
"గత మూడు రోజుల్లో ఆరోగ్యంగా ఉన్న 17 మంది వలంటీర్లకు టీకాలు వేశాం. టీకా మానవ ప్రయోగాలు గురువారం ప్రారంభమయ్యాయి. టీకా తీసుకున్న వలంటీర్లను కొద్ది రోజులపాటు పర్యవేక్షణలో ఉంచాం."
-డా. ఎస్కే రౌత్, నోబుల్ ఆస్పత్రి క్లినికల్ రీసెర్చ్ డిపార్ట్మెంట్ హెడ్
నిబంధనల ప్రకారం వలంటీర్లను ఎంపిక చేసుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు. ఆరోగ్యంగా ఉన్నవారిపై టీకాలను ప్రయోగిస్తున్నట్లు స్పష్టం చేశారు.
స్పుత్నిక్ వీ టీకాను రష్యాకు చెందిన గమలేయ జాతీయ పరిశోధన కేంద్రం అభివృద్ధి చేసింది. రష్యా నుంచి 10 కోట్ల స్పుత్నిక్ టీకా డోసులను కొనుగోలు చేసేందుకు భారత్ ఇదివరకే ఒప్పందం చేసుకుంది.