కేంద్రం రూపొందించిన 'ధరల హామీపై రైతుల సాధికారత, పరిరక్షణ, సేవా చట్టం-2020' అమలుకు సంబంధించి వ్యవసాయశాఖ గురువారం నిబంధనలు జారీచేసింది. పంట కొనుగోలు ఒప్పందాల్లో వివాదం తలెత్తితే రైతు పంట పండించిన భూమి ప్రాంతానికి చెందిన సబ్ డివిజినల్ మేజిస్ట్రేట్ దాన్ని పరిష్కరించాలని పేర్కొంది. ఒకవేళ భూమి ఒక సబ్ డివిజినల్ అథారిటీ పరిధికి మించి ఉంటే అందులో ఎక్కువ భాగం ఎవరి కిందికి వస్తే వారే పరిష్కరించాలని తెలిపింది.
* ఒప్పందం కుదుర్చుకున్నవారిలో ఎవరికైనా అందులో వివాదం ఉన్నట్లు అనిపిస్తే నిర్ణీత నమూనాలో, ప్రమాణ పత్రంతో కలిపి దరఖాస్తు చేసుకోవాలి. ఒప్పందం ప్రతి, ఇతరత్రా దస్తావేజులేవైనా ఉంటే అవి సాక్ష్యాధారాలుగా జతచేయాలి.
* దరఖాస్తు అందిన తర్వాత అందులో రాజీకి అవకాశం లేదని సంబంధిత సబ్‌డివిజినల్ అథారిటీ భావిస్తే, 14 రోజుల్లోపు ఒక రాజీ మండలి (కన్సీలియేషన్ బోర్డు)ను ఏర్పాటుచేయాలి. విచారణలకు కక్షిదారులు గానీ, వారి తరఫున అధీకృత వ్యక్తులుగానీ హాజరు కావచ్చు. న్యాయవాదులు మాత్రం హాజరు కాకూడదు.
* వివాదం పరిష్కారమైతే ఇరు పార్టీలు ఒప్పందంపై సంతకం చేయాలి. దానికి తప్పనిసరిగా కట్టుబడి ఉండాలి. పరిష్కారం కాకపోతే దానికి కారణాలతో క్లుప్తమైన నివేదిక సబ్‌డివిజినల్ అథారిటీకి అందించాల్సి ఉంటుంది.
* 30 రోజుల్లోపు వివాదం పరిష్కారం కాలేదని తేలితే, అక్కడి నుంచి 14 రోజుల్లోపు బాధిత పక్షాలు సబ్ డివిజినల్ అథారిటీకి మరోసారి దరఖాస్తు చేసుకోవాలి. ఆ అధికారి ఇచ్చే ఉత్తర్వులపై 30 రోజుల్లోపు జిల్లా కలెక్టర్‌కు అప్పీలు చేసుకోవచ్చు.