పౌరసత్వం కేవలం ప్రజల హక్కు మాత్రమే కాదని.. సమాజం పట్ల బాధ్యతకు సంబంధించినదని పేర్కొన్నారు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే. నాగ్‌పుర్‌లోని రాష్ట్రసంత్ తుకడోజీ మహరాజ్ నాగ్‌పుర్ విశ్వవిద్యాలయం 107వ స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. దేశంలోని కొన్ని విద్యా సంస్థలు వాణిజ్య సంస్థలుగా మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
"ఈ రోజుల్లో విద్య విస్తరిస్తోంది. దురదృష్టవశాత్తు కొన్ని ఇన్స్టిట్యూషన్స్ వాణిజ్య సంస్థలుగా వ్యవహరిస్తున్నాయి. విశ్వవిద్యాలయాల చదువుల ఉద్దేశం ఏంటో మనం ప్రశ్నించుకోవాలి. వర్సిటీలు ఉత్పత్తి కేంద్రాలుగా పనిచేయకూడదు. ఒక సమాజంగా మనం ఏం కోరుకుంటున్నామో విశ్వవిద్యాలయాలు ప్రతిబింబించగలగాలి. సమాజ లక్ష్యాలకు అనుగుణంగా దిశానిర్దేశనం చేసుకోవాలి. మీరందరికి క్రియాశీల పౌరులుగా ఉండే బాధ్యత ఉంది. పౌరసత్వం కేవలం హక్కు మాత్రమే కాదు సమాజం పట్ల బాధ్యత కూడా."-జస్టిస్ బోబ్డే, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
విద్య అనేది క్రమశిక్షణతో ముడిపడి ఉందని.... కొన్ని ప్రాంతాల్లో క్రమశిక్షణపై ఆగ్రహం వ్యక్తమవుతోందని అన్నారు జస్టిస్ బోబ్డే. విమర్శనాత్మక ధోరణిలో ఆలోచింపజేయడమే విద్య అసలైన లక్ష్యమని తెలిపారు. విశ్వవిద్యాలయాలు తల్లి వంటివని... పిల్లల జ్ఞానాన్ని పెంపొందించి జీవితాంతం రక్షణగా ఉంటాయని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: యథావిధిగా శిరిడీ సాయిబాబా ఆలయ దర్శనం