బిహార్ ఫస్ట్, బిహారీ ఫస్ట్ పేరుతో చిరాగ్ పాసవాన్ నేతృత్వంలోని లోక్‌జనశక్తి పార్టీ(ఎల్జేపీ) తన ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసింది. యువతకు ఉద్యోగ కల్పన, మహిళలకు కనీస వసతులు, వరదల నియంత్రణకు నదుల అనుసంధానం వంటి అంశాలను మేనిఫెస్టోలో పొందుపర్చింది.
రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రధాని మోదీ బాటలోనే తమ పార్టీ పయనిస్తుందని ఎల్జేపీ అధినేత చిరాగ్ పాసవాన్ పేర్కొన్నారు. మేనిఫెస్టో విడుదల తర్వాత మాట్లాడిన ఆయన.. మోదీ అభివృద్ధి పథాన్నే అనుసరిస్తామని చెప్పారు. తన తండ్రి దివంగత రామ్ విలాస్ పాసవాన్ దృష్టికోణంతో మేనిఫెస్టోను రూపొందించినట్లు చెప్పారు.
"సంకల్ప పత్రాన్ని మా నాన్న రామ్ విలాస్ పాసవాన్ విజన్ ఆధారంగా రూపొందించాం. యువతకు అభ్యున్నతి, విద్య, ఉద్యోగ అవకాశాలు, శాంతి భద్రతల మెరుగుదలే లక్ష్యంగా మేనిఫెస్టో తయారు చేశాం. ఒకవేళ ప్రస్తుత ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ పొరపాటున ఎన్నికల్లో గెలిస్తే రాష్ట్రం ఓడిపోతుంది. రాష్ట్రం మళ్లీ నాశనమవుతుంది. కులతత్వాన్ని ఆయన ఎలా ప్రోత్సహిస్తున్నారో చూస్తే ఆశ్చర్యం కలుగుతోంది. మతతత్వాన్ని ప్రోత్సహించే వ్యక్తి నేతృత్వంలో బిహార్ అభివృద్ధి జరుగుతుందని భావించడం సరికాదు."
-చిరాగ్ పాసవాన్, ఎల్జేపీ అధినేత
మేనిఫెస్టోలోని అంశాలు
- ఉద్యోగార్థులు, యజమానులు నేరుగా సంప్రదించుకునేందుకు ప్రత్యేక వెబ్ పోర్టల్
- యువజన కమిషన్ ఏర్పాటు చేయడం
- గ్రామ పంచాయతీలు, బ్లాకులు, మార్కెట్లలో మహిళలకు ప్రత్యేక శౌచాలయాలు
- వరదల నివారణకు ప్రత్యేక కెనాళ్లను ఏర్పాటు చేసి నదులను అనుసంధానం చేయడం
- బిహార్ పాడి పరిశ్రమకు ఊతమిచ్చేందుకు ఆహార తయారీ యూనిట్ల ఏర్పాటు, డెన్మార్క్ మోడల్ అమలు
మూడు దశల్లో జరగనున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికలు అక్టోబర్ 28న ప్రారంభం కానున్నాయి. నవంబర్ 10న ఫలితాలు వెల్లడవుతాయి.