ఇంద్రాణీ వాంగ్మూలంతోనే చిదంబరానికి చిక్కులు
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం అరెస్టు వ్యవహారం దేశ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఐఎన్‌ఎక్స్ కేసుకు సంబంధించి ఆయన ఇంటికి వెళ్లిన సీబీఐ అధికారుల బృందం గంటపాటు జరిగిన హైడ్రామా తరువాత నిన్న రాత్రి 10 గంటల సమయంలో అరెస్టు చేసింది.
ఈ రోజు చిదంబరంను పలు దఫాలుగా విచారించిన తర్వాత ఈ రోజు మధ్యాహ్నం సీబీఐ కోర్టులో అధికారులు హాజరు పరిచారు. 5 రోజుల పాటు చిదంబరాన్ని కస్టడీలోకి తీసుకునేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది.
'కార్తీకి సాయం చేయాలన్నారు'
చిదంబరాన్ని అరెస్టు చేసేందుకు ఐఎన్‌ఎక్స్ మీడియా సంస్థ యజమాని ఇంద్రాణీ ముఖర్జీ గతేడాది ఫిబ్రవరి 17న ఇచ్చిన వాంగ్మూలమే ప్రధాన ఆధారమైంది. 2006లో చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో దిల్లీ నార్త్‌బ్లాక్ కార్యాలయంలో కలిశామన్నారు. ఆ సమయంలో ఆయన తన కుమారుడు కార్తీని తమకు పరిచయం చేశాడని వెల్లడించారు. కార్తీ వ్యాపారాలకు ఐఎన్‌ఎక్స్ మీడియా ద్వారా సాయం చేయాలని తనను, తన భర్త పీటర్ ముఖర్జీని కోరారని ఆమె పేర్కొన్నారు.
'లంచం డిమాండ్'
ఈ వాంగ్మూలమే చిదంబరంపై సీబీఐ, ఈడీల విచారణకు కీలక ఆధారమైంది. దిల్లీలోని ప్రముఖ హోటల్‌లో కార్తీ తమను క్విడ్ ప్రోకో కింద 1 మిలియన్ డాలర్ల లంచం డిమాండ్ చేశారని ఆమె తన వాంగ్మూలంలో తెలిపారు.
కార్తీ చిదంబరానికి చెందిన అడ్వాంటేజ్ స్ట్రాటజిక్ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (ఏఎస్‌సీపీఎల్) కంపెనీతో కలిసి పనిచేసిన సందర్భంలోనే రూ.305 కోట్ల మేర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌బీఐ) అందుకోవడానికి ఐఎన్‌ఎక్స్ మీడియా’కు విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎఫ్‌ఐపీబీ) పచ్చజెండా ఊపింది.
చక్రం తిప్పిన చిదంబరం!
ఈ వ్యవహారంలో నగదు అందుకున్న కంపెనీలన్నీ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా చిదంబరం కుమారుడు కార్తీ నియంత్రణలో ఉన్నాయన్నది సీబీఐ, ఈడీల ఆరోపణ. విదేశీ పెట్టుబడుల విషయంలో ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ మాత్రమే ఆమోదం తెలపాల్సి ఉంటుంది. నిబంధనలు ఉల్లంఘించి ఎఫ్‌ఐపీబీ ద్వారా సమ్మతి వచ్చేలా చిదంబరం చక్రం తిప్పారనేది ప్రధాన అభియోగం. ఈ కేసులోనే చిదంబరాన్ని అనేకసార్లు దర్యాప్తు అధికారులు ప్రశ్నించారు.
రూ.3500 కోట్ల ఎయిర్‌సెల్-మ్యాక్సిస్ ఒప్పందం కేసులోనూ చిదంబరం ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఐఎన్‌ఎక్స్ కేసు వ్యవహారంలో కార్తీ చిదంబరం కూడా గతేడాది ఫిబ్రవరిలో అరెస్టయ్యారు. ప్రస్తుతం బెయిల్ మీదనే ఉన్నారు కార్తీ.