అనారోగ్యంతో కోమాలోకి వెళ్లిన ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగికి బుధవారం రాత్రి మళ్లీ గుండె పోటు వచ్చినట్లు వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందని తెలిపారు. గుండె, పల్స్ రేటు పడిపోవటం వల్ల ఆరోగ్య పరిస్థితి అత్యంత క్లిష్టంగా మారిందని చెప్పారు.
అనారోగ్యంతో 9 నెలల క్రితం కోమాలోకి వెళ్లారు జోగి. ఈ మే 9న గుండె పోటు వచ్చిన క్రమంలో శ్రీ నారాయణ ఆస్పత్రిలో చేరారు. అప్పటినుంచి వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు.
ప్రభుత్వ ఉన్నతాధికారిగా పనిచేసిన జోగి 1986లో కాంగ్రెస్‌లో చేరారు. పార్టీలో, ప్రభుత్వంలో పలు కీలక పదవులు చేపట్టారు. ఛత్తీస్‌గఢ్ తొలి సీఎంగా పనిచేసిన ఆయన 2016లో కాంగ్రెస్ నుంచి విడిపోయి జనతా కాంగ్రెస్ పార్టీ స్థాపించారు. ఆయన కుమారుడు అమిత్ జోగి ప్రస్తుతం రాజకీయాల్లో క్రియాశీలంగా ఉన్నారు.