ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత అజిత్ జోగి అంత్యక్రియలు ముగిశాయి. పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో గౌరెలా-పెండ్ర-మార్వాహి జిల్లాలోని శ్మశాన వాటికలో రాత్రి 8 గంటలకు బిషప్‌లు, పాస్టర్ల దైవ ప్రార్థనల అనంతరం భౌతికకాయాన్ని ఖననం చేశారు.
మూడు రోజులు సంతాప దినాలు
కరోనా నిబంధనల కారణంగా శ్మశానవాటిక వరకు కుటుంబసభ్యులు మాత్రమే హాజరయ్యారు. జోగి మృతికి గౌరవ సూచికగా ఆ రాష్ట్ర ప్రభుత్వం మూడు రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించింది.
నాయకులు, ప్రజల నివాళి
అంతకుముందు.. జోగి మృతదేహాన్ని రాయ్‌పుర్‌లోని ఆయన నివాసం నుంచి బిలాస్‌పుర్ వరకు సుమారు 125 కిలోమీటర్ల దూరం రహదారిపై తీసుకువెళ్లారు. మార్గ మధ్యలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని నివాళులర్పించారు. తర్వాత పార్థివదేహాన్ని బిలాస్‌పుర్ మార్వాహి సడాన్ వద్ద ఉంచగా... పలువురు నాయకులు, ప్రజలు వచ్చి నివాళులర్పించారు.
అనంతరం జీపీఎం జిల్లాలో ఉన్న ఆయన సొంత గ్రామమైన జోగిసార్కు తీసుకొనివెళ్లారు. జోగి పార్థివదేహాన్ని కడసారి చూసేందుకు ప్రజలు తరలివచ్చారు.
ఛత్తీస్‌గఢ్ తొలి సీఎం
ప్రభుత్వ ఉన్నతాధికారిగా పనిచేసిన జోగి 1986లో కాంగ్రెస్‌లో చేరారు. పార్టీలో, ప్రభుత్వంలో పలు కీలక పదవులు చేపట్టారు. ఛత్తీస్‌గఢ్ తొలి సీఎంగా పనిచేసిన ఆయన 2016లో కాంగ్రెస్ నుంచి విడిపోయి జనతా కాంగ్రెస్ పార్టీ స్థాపించారు. ఆయన కుమారుడు అమిత్ జోగి ప్రస్తుతం రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారు.