దేశ రాజధాని దిల్లీలో కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు చర్యలు చేపడుతోంది కేంద్రం. బాధితులను గుర్తించేందుకు 6 లక్షల రాపిడ్ టెస్టులు చేయనున్నట్ల తెలిపింది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జీ కిషన్ రెడ్డి తెలిపారు. కొత్తగా 169 పరీక్ష కేంద్రాలను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. పరీక్షల నిర్వహణ కోసం 50 వేల రాపిడ్ టెస్టింగ్ కిట్లను ఇప్పటికే దిల్లీకి పంపినట్లు పేర్కొన్నారు. వీటిని దక్షిణకొరియా నుంచి దిగుమతి చేసుకున్నట్లు వెల్లడించారు.
కరోనాపై పోరులో భాగంగా దిల్లీకి అదనంగా 500 వెంటిలేటర్లు, 650 అంబులెన్సులు సరఫరా చేసినట్లు కిషన్ రెడ్డి చెప్పారు. దిల్లీలోని కంటైన్మెంట్ జోన్లలో ఉన్న ప్రజలు, వైరస్ బాధితుల బంధువులు, కుటుంబ సభ్యులు నూతనంగా ఏర్పాటు చేసిన కేంద్రాల్లో పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నందున దిల్లీ ప్రజల్లో భయాందోళన వ్యక్తమవుతోందని, అందుకే కేంద్రం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తోందని హోంశాఖ సహాయమంత్రి చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ సూచన మేరకు హోమంత్రి అమిత్ షా నేతృత్వంలో ప్రజాసంక్షేమం కోసం దిల్లీ ప్రభుత్వంతో కలిసి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు.
దిల్లీలో కరోనా కేసుల సంఖ్య 47 వేల 102కు చేరుకుంది. 1,904 మంది వైరస్ బారినపడి మరణించారు. 17 వేల 457 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు.