నూతన పార్లమెంట్ భవన సముదాయ నిర్మాణానికి సంబంధించిన సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగమైన రాజ్‌పథ్ పునర్నిర్మాణ పనుల కాంట్రాక్ట్.. షాపూర్జీ పల్లోంజీకి దక్కే అవకాశం ఉంది. ఈ పనుల కోసం పిలిచిన ఫైనాన్షియల్ బిడ్స్‌లో అత్యంత తక్కువ మొత్తాన్ని (రూ.477.08 కోట్లు)ఆ కంపెనీ కోట్ చేసి ప్రథమ స్థానంలో నిలిచింది.
రాజ్‌పథ్ పునర్నిర్మాణ పనులకు కేంద్ర ప్రజా పనుల విభాగం (సీపీడబ్ల్యూడీ) ప్రతిపాదించిన అంచనా వ్యయం కన్నా ఇది 4.99 శాతం తక్కువ. అర్హత సాధించిన ఇతర కంపెనీలు.. వరుస క్రమంలో టాటా ప్రాజెక్ట్స్ ( రూ.488.78 కోట్లు), ఐటీడీ సిమెంటేషన్ ఇండియా లిమిటెడ్ (రూ.490.59 కోట్లు), ఎన్సీసీ లిమిటెడ్ ( రూ.601.46 కోట్లు) నిలిచాయి.
పార్లమెంటు భవన నిర్మాణం కోసం గత ఏడాది సెప్టెంబర్‌లో పిలిచిన టెండర్‌ను టాటా ప్రాజెక్ట్స్ గెలుచుకున్న విషయం తెలిసిందే. రాజ్‌పథ్ పునర్నిర్మాణ పనులను ఈ నెల 26న గణతంత్ర దినోత్సవాలు ముగిసిన మరుసటి రోజు నుంచే ప్రారంభించి వచ్చే ఏడాది రిపబ్లిక్ డే నాటికి పూర్తి చేస్తారని అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి: యూఎస్ క్యాపిటల్ వద్ద ఉద్రిక్తత.. ట్రంప్ శాంతి మంత్రం