2019 భాజపా ఎన్నికల ఎజెండాలోని ఉమ్మడి ఓటర్ జాబితాపై కేంద్రం పావులు కదుపుతోంది. లోక్‌సభ, అసెంబ్లీ, స్థానిక ఎన్నికలను ఒకే ఓటరు జాబితాతో నిర్వహించాలన్న ప్రతిపాదనపై కసరత్తు ప్రారంభించింది. ప్రస్తుతం లోక్‌సభ, శాసనసభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా రూపొందిస్తుండగా.. మున్సిపాలిటీ, పంచాయతీ తదితర స్థానిక ఎన్నికలకు ఆయా రాష్ట్ర ఎన్నికల సంఘాలే జాబితాలను తయారుచేస్తున్నాయి. దీనివల్ల ఒకే పని మూడు సార్లు జరుగుతోందని, అనవసర ధన వ్యయం అవుతోందని కేంద్రం భావిస్తోంది. దీంతో పాటు ఓ జాబితాలో పేరుండి.. మరోదాంట్లో లేకపోవడం లాంటి గందరగోళ పరిస్థితులూ తలెత్తుతున్నాయి. ఇందుకు ఉమ్మడి ఓటరు జాబితాయే పరిష్కారమని కేంద్రం భావిస్తోంది.
రాజ్యాంగం ప్రకారం.. పంచాయతీ, మున్సిపాలిటీ తదితర స్థానిక ఎన్నికలకు ఓటర్ల జాబితా తయారు చేసుకొనే అధికారం రాష్ట్రాల ఎన్నికల సంఘాలకే ఉంది. అయితే కేవలం 8 రాష్ట్రాలు(కేరళ, యూపీ, ఉత్తరాఖండ్, ఒడిశా, అసోం, మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్), జమ్ము కశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతం తప్ప అన్నీ కేంద్ర ఎన్నికల సంఘం జాబితా ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తున్నాయి. ఈ 8 రాష్ట్రాలను, జమ్ముకశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతాన్ని ఒప్పించాలని ప్రధాని కార్యాలయంలో ఇటీవల జరిగిన ఓ ఉన్నతస్థాయి సమావేశంలో నిర్ణయించారు. రాష్ట్రాలను ఒప్పించడమే కాకుండా, మరిన్ని సమస్యలను కూడా అధిగమించాల్సి ఉంటుందని అధికారులు అంటున్నారు. "రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాకు అనుగుణంగా కేంద్ర జాబితా తయారు చేయాలి. డిజిటల్ సాంకేతికతను ఉపయోగించుకుంటే సమస్య పరిష్కారం కావచ్చు" అని ఎన్నికల సంఘానికి చెందిన ఓ సీనియర్ అధికారి చెప్పారు.
ఇదీ చూడండి:- బిహార్ ఎన్నికల కోసం భాజపా 'కమల్ కనెక్ట్'