బ్యాంకు రుణాలు ఎగ్గొట్టి పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి జతిన్ మెహతాపై... తాజాగా సీబీఐ మరో రెండు కేసులు నమోదు చేసింది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సుమారు రూ.587.55 కోట్ల రుణాలు ఎగ్గొట్టిన కేసులో నిందితునిగా ఉన్న జతిన్ కోసం సీబీఐ గాలిస్తోంది.
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర నుంచి సుమారు రూ.323.40 కోట్లు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి సుమారు రూ.264.15 కోట్లు రుణాలు పొంది, తిరిగి చెల్లించకుండా మోసానికి పాల్పడ్డాడని అతనిపై అభియోగం. ఈ రెండు బ్యాంకులు ఈ మేరకు ఫిర్యాదు చేయడం వల్ల జతిన్‌పై కేంద్ర దర్యాప్తు సంస్థ కేసు నమోదు చేసింది.
జతిన్ మెహతాతోపాటు బాంబే డైమండ్స్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్' డైరెక్టర్లు రమేష్ ఐ ప్రకాశ్, రవిచంద్రన్ రామస్వామి, హరీష్ రతిలాల్ మెహతా, జోర్డాన్ దేశానికి చెందిన హతియమ్ సల్మాన్ అలీ అబూ ఒబైదా పైనా సీబీఐ కేసులు నమోదు చేసింది.
14 బ్యాంకులకు కన్సార్షియమ్‌గా ఉన్న ఈ రెండు బ్యాంకులు... జతిన్ వజ్రాల కంపెనీకి సుమారు రూ.4,600 కోట్ల రుణ సౌకర్యాలను కల్పించాయి. ఈ నేపథ్యంలో సీబీఐ ముంబయి, అహ్మదాబాద్, కోయంబత్తూరులో జతిన్‌కు సంబంధించిన స్థలాలు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించింది.
ముందే పారిపోయాడు..
జతిన్ మెహతా తన వజ్రాల కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ పదవి నుంచి 2011 ఏప్రిల్ నెలలోనే వైదొలిగాడు. అప్పటి నుంచి నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నాడు. బ్యాంకులు రుణాల ఎగవేత కేసును పెట్టక మునుపే జతిన్ దేశం విడిచి వెళ్లిపోయాడు. ప్రస్తుతం అతను కరీబియన్ దీవుల్లో ఉన్నట్లు సీబీఐ అధికారులు భావిస్తున్నారు.
బ్యాంకు రుణాలు ఎగ్గొట్టిన కేసులో జతిన్‌పై సీబీఐ ఇప్పటికే 7 కేసులు నమోదు చేసింది. తాజాగా మరో రెండు కేసులు బనాయించింది.
ఇదీ చూడండి: 'ఏఎన్-32 ప్రయాణికుల కోసం ముమ్మర గాలింపు'