కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీపై కర్ణాటక శివమొగ్గలోని సాగర టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పీఎం కేర్స్ నిధులను దుర్వినియోగం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ చేసిన ట్వీట్ ఆధారంగా కేవీ ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు.
నిరాధార ఆరోపణలు చేస్తూ ప్రజలను కాంగ్రెస్ తప్పుదోవ పట్టిస్తోందని ఫిర్యాదుదారుడు ప్రవీణ్ ఆరోపించారు. మే 11న సాయంత్రం 6 గంటలకు కాంగ్రెస్ అధికారిక ట్విట్టర్ ఖాతా నుంచి వచ్చిన ట్వీట్‌ను ఫిర్యాదులో పొందుపరిచారు. 'కొవిడ్‌పై పోరాటానికి ప్రజల సహకారంతో ఏర్పాటైన పీఎం-కేర్స్ నిధులను ప్రధాని నరేంద్ర మోదీ దుర్వినియోగం చేస్తున్నారు' అని కాంగ్రెస్ ట్వీట్ చేసినట్లు పేర్కొన్నారు ప్రవీణ్. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ సహా ట్విట్టర్ ఖాతాతో సంబంధం ఉన్న పార్టీ కార్యకర్తలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ స్పందన
అయితే ఈ విషయాన్ని ఖండించింది కర్ణాటక రాష్ట్ర కాంగ్రెస్. ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు, బాధ్యత ప్రతిపక్షానికి ఉంటుందని ఆ రాష్ట్ర కాంగ్రెస్ ప్రతినిధి సుభాష్ అగర్వాల్ పేర్కొన్నారు. విపక్షాల గళాన్ని అణిచివేస్తే ప్రజాస్వామ్యం మరుగునుపడిపోతుందని వ్యాఖ్యానించారు. విపత్తు సమయంలో ఉపయోగించుకోవడానికి పీఎం రిలీఫ్ ఫండ్ ఉన్నప్పటికీ.. కొత్తగా పీఎం-కేర్స్ ఫండ్స్ ఏర్పాటు చేయడం అనవసరమని పార్టీ ఎప్పటినుంచో చెబుతోందని గుర్తు చేశారు.
ఇదీ చూడండి: 'రాజీవ్‌కు నివాళిగా కిసాన్ న్యాయ్ యోజన'