2015 భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు అప్పటి అమెరికా అధ్యక్షుడు ఒబామా హాజరైన సమయంలో ఉగ్రవాదులు పలు ప్రధాన ప్రాంతాల్లో బాంబు పేలుళ్లకు కుట్రపన్నినట్లు ఆలస్యంగా తెలిసింది.
ముంబయి జైల్లో ఉన్న ఉగ్రవాది జైనలుద్దీన్‌ను ఇటీవల విచారించినపుడు ఈ కుట్ర విషయం బహిర్గతం చేశాడని బెంగళూరు సీసీబీ పోలీసు అధికారులు ఆదివారం తెలిపారు. ఒబామా రాక ముందే జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అధికారులు ఇండియన్ ముజాహిద్దీన్ సంస్థ (ఐఎం) ఉగ్రవాదిని అదుపులోకి తీసుకొని విచారించినపుడు జైనలుద్దీన్ వ్యవహారం తెలిసింది.
2014లో బెంగళూరు చర్చి స్ట్రీట్‌లో జరిగిన బాంబు పేలుడు ఘటనతో జైనలుద్దీన్‌కు సంబంధం ఉన్నట్లు గుర్తించారు. తీవ్రవాది రియాజ్ భత్కళ్, సానుభూతిపరుడిగా మారిన వైద్యుడు సయ్యద్ ఇస్మాయిల్ అఫాక్‌తో నిందితుడికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. భారత్‌లో పేలుడు పదార్థాలను తరలించేందుకు అఫాక్ సహకరించేవాడని జైనలుద్దీన్ విచారణలో పేర్కొన్నాడని సీసీబీ పోలీసులు తెలిపారు.
రియాజ్ భత్కళ్, అఫాక్‌లను వివిధ ప్రాంతాల్లో పోలీసులు అరెస్టు చేసి వేర్వేరు కారాగారాల్లో ఉంచారు.