ఈ ఏడాది ఇప్పటికే చాలా విచిత్రంగా గడిచింది. రైలు పెట్టెల్లాగా ఒకదాని వెంట ఒకటి ప్రకృతి వైపరీత్యాలు ప్రపంచాన్ని వణికించాయి. ఎక్కడో చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచాన్ని కుదిపేసింది. లక్షల మందిని పొట్టన బెట్టుకుంది. అగ్రదేశాల ఆర్థిక వ్యవస్థలను చిన్నాభిన్నం చేసింది. దీంతో పాటు భారీ వర్షాలు, వరదల, భూకంపాలు.. ఇలా ఈ 2020లో చాలా చూశాం.. చూస్తున్నాం.. మళ్లీ కొత్తగా ఆకాశంలో బ్లూమూన్ అని కంగారుపడొద్దు. దీని వల్ల మనకు కలిగే నష్టం ఏం లేదు.
ఇవాళ (అక్టోబరు 31) రాత్రి 8:15 గంటల తర్వాత చంద్రుడు 'బ్లూమూన్'గా దర్శనమిచ్చాడు. అంటే సాధారణంగా ఉండే పరిమాణం కంటే కొద్దిగ పెద్దగా.. ప్రకాశవంతంగా.. మరింత తెల్లగా కనిపించాడు. దీంతో పాటు జాబిల్లి పక్కన ప్రకాశవంతమైన మరో ఎర్రగా ఉన్న నక్షత్రం లాంటిది కనువిందు చేసింది. ఇది భూమికి పక్కనే ఉన్న మరో గ్రహం అంగారకుడు.
అలా ఎందుకంటారు?
ఇలా సంవత్సరానికి 12 సార్లు పౌర్ణమి రోజుల్లో నిండుగా కనిపించే చంద్రుడికి పూర్వం రోజుల్లో ఒక్కోసారి ఒక్కో పేరు పెట్టేవారు. సంవత్సరాన్ని నాలుగు సీజన్లుగా విభజిస్తే ప్రతి దాంట్లో మూడు పౌర్ణమిలు మనకు దర్శనమిస్తాయి. ఇలా సీజనులో వచ్చే చివరి పౌర్ణమిని 'బ్లూమూన్'గా పిలవడం మొదలుపెట్టారు. నెలలో వచ్చే రెండో పౌర్ణమిని కూడా ఇలానే పిలుస్తారనే వాదన కూడా ఉంది. రెండున్నర ఏళ్లలో ఒక నెలలో మాత్రం రెండు పౌర్ణమిలు వస్తాయి. ఆ విచిత్రం ఈరోజు కనువిందు చేసింది.
354 రోజులు..
మనం ఏడాదిలో చూసే 12 పౌర్ణమిలలో ఒక్కోదానికి 29.5 రోజుల వ్యత్యాసం ఉంటుంది. ఇలా 354 రోజుల్లో డజను సార్లు నిండు జాబిల్లిని మనం చూడగలం. ఇవి కాకుండా సంవత్సరంలో మిగిలిపోయిన రోజులని కలుపుతారు. ఫలితంగా మరో పౌర్ణమి వస్తుంది. ఇలా అదనంగా వచ్చిన నిండు చంద్రుడిని కూడా 'బ్లూమూన్'గా పిలుస్తుంటారు. ఇదిలా ఉంటే చివరిగా బ్లూమూన్‌ను 2018లో మార్చి నెలలో యూఎస్‌లో కనిపించింది. అన్ని టైమ్ జోన్లలో 'హాలోవీన్' రోజున బ్లూమూన్ దర్శనమివ్వడం.. 1944 తర్వాత ఇదే మొదటిసారి.