పార్లమెంట్ ఎంపీ శశిథరూర్ సహా ఆరుగురు జర్నలిస్టులపై దేశద్రోహం కేసు నమోదు చేయడాన్ని కాంగ్రెస్ తీవ్రంగా తప్పుబట్టింది. తన చర్యలతో ప్రజాస్వామ్య గౌరవానికి భంగం కలిగిస్తున్నారని భాజపాపై ధ్వజమెత్తింది. ప్రజా ప్రతినిధులను, జర్నలిస్టులను ఎఫ్ఐఆర్ల పేరుతో భయభ్రాంతులకు గురిచేయడం ప్రమాదకరమని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ అన్నారు.
"ప్రజాస్వామ్యాన్ని గౌరవించడం ప్రభుత్వ విధి. భయంతో కూడిన ఈ వాతావరణం ప్రజాస్వామ్యానికి హానికరం. సీనియర్ జర్నలిస్టులు, ప్రజాప్రతినిధులపై ఎఫ్ఐఆర్లు దాఖలు చేస్తూ ప్రజాస్వామ్య గౌరవానికి భాజపా ప్రభుత్వం భంగం కలిగించింది."
-ప్రియాంకా గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి
కేంద్రంతో పాటు భాజపా అధికారంలో ఉన్న రాష్ట్రాలు సైతం అసమ్మతి గళాన్ని అణచివేస్తున్నాయని కాంగ్రెస్ ప్రధాన ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా ఆరోపించారు. భాజపా చర్యలు బ్రిటీష్ పాలనలో తీసుకొచ్చిన రౌలత్ వంటి చట్టాల కంటే ప్రమాదకరంగా మారుతున్నాయని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని భాజపా నేతలు అణచివేస్తున్నారని, కాంగ్రెస్ ఎంపీ సహా ఆరుగురు జర్నలిస్టులపై దాఖలైన ఎఫ్ఐఆర్ అందుకు ఉదాహరణ అని పేర్కొన్నారు.
"'మీరు మాకు మద్దతుగా ఉండాలి. లేదంటే ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించి మిమ్మల్ని వేధిస్తాం' అనే ఫార్ములా మోదీ ప్రభుత్వం డీఎన్ఏలో ఉంది. తమ విరోధులను లక్ష్యంగా చేసుకొని భయోత్పాతాలను సృష్టించడంపైనే భాజపా చెబుతున్న 'నూతన భారత్' ఆధారపడి ఉంది. రైతులు, యువత, దళితులు, గిరిజనులు, మహిళలు.. ఎవరు తమకు వ్యతిరేకంగా మాట్లాడినా వారిపై దేశద్రోహులనే ముద్రవేయడం పరిపాటిగా మారింది."
-రణదీప్ సుర్జేవాలా, కాంగ్రెస్ ప్రతినిధి
నిరసనలు చేస్తున్న రైతులపై కేంద్ర మంత్రులు ప్రవర్తించిన తీరును తప్పుబట్టారు సుర్జేవాలా. లక్షలాది మంది రైతులపై మంత్రులు విషం చిమ్మడాన్ని దేశం చూసిందని చెప్పుకొచ్చారు. తమకు అనుకూలంగా ఉండే మీడియాను రక్షించడం, లేనివారిపై ఉక్కుపాదం మోపడం భాజపా నయవంచనకు నిదర్శనమని అన్నారు.
అప్రకటిత అత్యయిక స్థితిలో ఉన్నాం: పాత్రికేయ సంఘాలు
రాజ్‌దీప్ సర్దేశాయ్, మృణాల్ పాండే సహా ఆరుగురు జర్నలిస్టులపై దేశద్రోహం కేసులు నమోదు చేయడాన్ని శనివారం.. పాత్రికేయ సంఘాలు ఖండించాయి. దేశంలో అప్రకటిత అత్యయిక పరిస్థితి నెలకొందని ఆరోపించాయి. గణతంత్ర దినోత్సవాల ట్రాక్టర్ పరేడ్‌లో జరిగిన హింసకు కొందరు జర్నలిస్టుల కవరేజీ, వ్యాఖ్యలే కారణమంటూ మధ్యప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులు ఎఫ్ఐఆర్లు నమోదు చేశాయి.
దీనికి నిరసనగా శనివారం.. ప్రెస్‌క్లబ్ ఆఫ్ ఇండియా, ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా, దిల్లీ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్(డీయూజే), ఇతర పాత్రికేయ సంఘాలు ఆందోళన నిర్వహించాయి.