భాజపా తీవ్ర విమర్శలు చేశారు తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీ సీనియర్ నేత, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సుబ్రాతా ముఖర్జీ. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా గెలవలేకపోతే బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని హత్య చేయడానికి ఆ పార్టీ కుట్ర పన్నుతుందని ఆరోపించారు. దక్షిణ 24 పరగణాల జిల్లాలో రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
"వారు (భాజపా).. మమతా బెనర్జీని పదవి నుంచి తొలగించాలని కుట్ర చేస్తున్నారు. ఎన్నికల్లో దీదీని ఓడించలేకపోతే రహస్యంగా హత్య చేయడానికి ప్రయత్నిస్తారు. బంగాల్‌లో అశాంతిని సృష్టించడానికి బయటి వ్యక్తుల్ని తీసుకొస్తున్నారు. కోట్లమంది ప్రజలకు తల్లి అయిన మమతకు హాని చేయడానికి భాజపా ప్రయత్నిస్తే.. అడ్డుకోవడానికి ఏదైనా చేస్తాం."
- సుబ్రాతా ముఖర్జీ, టీఎంసీ సీనియర్ నేత
భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్‌పై దాడి గురించి మాట్లాడుతూ.. "భాజపా తమ నేతల వాహనాలపై రాళ్లు విసరడానికి మనుషుల్ని నియమించుకున్నట్లు మా సభ్యుల దర్యాప్తులో తేలింది" అని అన్నారు ముఖర్జీ.
ఇదీ చూడండి: బంగాల్‌లో కేంద్ర బలగాలను దింపాలి: భాజపా