కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తోన్న సమరంలో.. తన వంతుగా సహకారం అందిస్తున్నట్టు ప్రకటించింది భాజపా. ఆ పార్టీ ఎంపీలంతా తమ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి పథకం (ఎంపీ ల్యాడ్స్) నిధుల నుంచి రూ. కోటి చొప్పున కేంద్ర ప్రభుత్వ సహాయ నిధికి ఇవ్వనున్నట్లు.. భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వెల్లడించారు. అంతేకాకుండా తమ పార్టీకి చెందిన అందరు ఎంపీలు, ఎమ్మెల్యేలంతా ఒక నెల జీతాన్ని కేంద్ర ప్రభుత్వ సహాయ నిధికి ఇస్తారని ఆయన తెలిపారు.
ప్రస్తుతం భాజపాలో 386 మంది ఎంపీలు ఉన్నారు. వీరిలో 303 మంది లోక్సభ, 83 మంది రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం ఎంపీలకు రూ. 5 కోట్లు ప్రతీ ఏటా కేటాయిస్తున్నారు. ఆ నిధులను ఆయా నియోజకవర్గాల్లో సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించాల్సి ఉంటుంది.