ఇది కేరళ త్రిస్సూర్ జిల్లాకు చెందిన వియ్యూర్ కేంద్ర కారాగారం. ఇక్కడ ఖైదీలు తయారు చేసిన వేడి వేడి బిర్యానీని ఆన్లైన్ ద్వారా ప్రజలకు అందిస్తున్నారు అధికారులు. ఇందుకోసం ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీతో జతకట్టారు.
ఫ్రీడమ్ ఫుడ్ ఫ్యాక్టరీ...
2011 నుంచి 'ఫ్రీడమ్ ఫుడ్ ఫ్యాక్టరీ' ద్వారా ఖైదీలు తయారు చేస్తోన్న వంటకాల అమ్మకాలు చేపడుతున్నారు. గురువారం నుంచి ఆన్లైన్లో బిర్యానీ అమ్మకాలు అందుబాటులోకి వచ్చాయి. జైలుకు సుమారు 6 కిలోమీటర్ల పరిధిలో ఈ నోరూరించే బిర్యానీని సరఫరా చేస్తున్నారు.
జైలు వద్ద కౌంటర్ వ్యవస్థతో పాటు ఆన్‌లైన్‌కు ప్రత్యేక మెనూ ఏర్పాటు చేశారు. 'ఫ్రీడమ్ కాంబో లంచ్' పేరిట 300 గ్రాముల బిర్యానీ, చికెన్ లెగ్ పీస్, మూడు రొట్టెలు, ఒక చికెన్ కర్రీ, పచ్చడి, సలాడ్, ఓ కప్ కేక్, ఒక లీటర్ మినరల్ వాటర్ బాటిల్‌ను రూ.127కే అందిస్తున్నారు. వీటన్నింటినీ అరటి ఆకులో అందించటం ప్రత్యేకత.
ప్రస్తుతం కౌంటర్ ద్వారా రోజుకు 25,000 చపాతీలు, 500 బిర్యానీ అమ్మకాలు జరుగుతున్నాయి. 100 మంది ఖైదీలు వీటి తయారీలో పాలుపంచుకుంటున్నారు.
ఆన్లైన్ ద్వారా రోజుకు 100 కాంబోలు అమ్మాలని భావిస్తున్నట్లు జైలు అధికారులు చెప్పారు. విజయవంతమైతే.. మరిన్ని ప్రత్యేక కాంబోలను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు.