వారంతా భోపాల్ గ్యాస్ లీకేజి బాధితులు. 1984 నాటి ఘటనలో ప్రాణాలనైతే నిలబెట్టుకోగలిగినా వారి ఆరోగ్య పరిస్థితులు దుర్బలం. అలాంటివారిపై ఇప్పుడు కరోనా వైరస్ పిడుగులా పడింది. భోపాల్‌లో తాజా మరణాల్లో ఎక్కువ భాగం ఇలాంటివే. ఆ నగరంలో ఇప్పటివరకు 19 మంది ప్రాణాలు కోల్పోతే వారిలో 17 మంది గ్యాస్ లీకేజి బాధితులేనని 'భోపాల్ గ్రూప్ ఫర్ ఇన్ఫర్మేషన్ అండ్ యాక్షన్' (బీజీఐఏ) అనే స్వచ్ఛంద సంస్థ చెబుతోంది.
దీంతో గ్యాస్ బాధితుల్లో కరోనా ప్రాథమిక లక్షణాలు ఉన్నవారందరికీ పరీక్షలు నిర్వహింపజేయాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా మిగిలినవారి నుంచి బాధితుల్ని వేరు చేయవచ్చని భావిస్తోంది. భోపాల్ బాధితులకు ప్రత్యేకించిన ఆసుపత్రిని రాష్ట్రస్థాయి కొవిడ్-19 ఆసుపత్రిగా మార్చేసి, మరణాలు పెరిగాకే ఆ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకుందని బీజీఐఏ కన్వీనర్ రచనా ధింగ్రా చెప్పారు.
బాధితులకు శ్వాసకోశ సమస్యలు, మధుమేహం, క్యాన్సర్, క్షయ వంటివి ఉండడం వల్ల సులభంగా కరోనా బారిన పడుతున్నారని తెలిపారు.