వ్యర్థాలతో కళాఖండాలను తయారు చేసి ఔరా అనిపిస్తున్నారు ఒడిశా బర్హంపుర్లోని ఐటీఐ విద్యార్థులు. నగరంలో వివిధ ప్రాంతాల్లో లభ్యమైన ఇనుప వ్యర్థాలతో అద్భుతాలు సృష్టించారు. వాళ్లు రూపొందించిన వ్యర్థాల పార్కు ఇప్పుడు ఆసియాలోనే అతి పెద్ద వ్యర్థాల పార్కుగా నిలిచింది. ప్రఖ్యాత 'ఏషియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్'లో చోటు దక్కించుకుంది.

10వేల చదరపు అడుగుల విస్తీర్ణం ఉండే ఈ పార్కులో స్పేస్ షటిల్ మ్యూజియంతోపాటు, జిరాఫీ, రోబో, గిటార్, ఐరన్ మ్యాన్, డాల్ఫిన్, తాబేలు, హెలికాప్టర్, బ్లాక్ టెయిల్ జింక తదితర ఆకృతులు ఉన్నాయి.
చదువుతోపాటు సృజనాత్మకత

బర్హంపుర్లోని ఐటీఐలో చదువుకునే విద్యార్థులు ప్రత్యేక నైపుణ్యాలను అలవరుచుకున్నారు. ముఖ్యంగా వ్యర్థాలకు వారి సృజనాత్మకతను జోడించి అద్భుతమైన ఆకృతులను రూపొందించటంలో విశేష గుర్తింపు పొందారు. వీరు తయారు చేసిన కళాఖండాలతో క్యాంపస్‌ను ఒక పర్యటక స్థలంగా మార్చారు.