కరోనా వ్యాక్సిన్ మొదటి బ్యాచ్‌ను తీసుకోవడానికి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు (యూటీ) సిద్ధంగా ఉండాలని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ఇందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని రాష్టాలకు సూచించింది.
పంపిణీదారు దగ్గర నుంచి తొలుత 19 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు టీకాలు అందుతాయని రాష్ట్రాలతో జరిగిన సమావేశంలో ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఆంధ్రప్రదశ్, అసోం, బిహార్, ఛత్తీస్‌గఢ్, దిల్లీ, గుజరాత్, హరియాణా, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, ఉత్తర్‌ప్రదేశ్, బంగాల్ రాష్ట్రాల టీకా గ్రహీతలు ఈ మేరకు సిద్ధంగా ఉండాలని సూచించింది.
మిగిలిన 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఆయా సంబంధిత ప్రభుత్వ మెడికల్ స్టోర్ డిపోలలో టీకాలను తీసుకోవాలని స్పష్టం చేసింది.
"అన్ని రాష్ట్రాలు, యూటీలకు అతి త్వరలోనే కొవిడ్ -19 వ్యాక్సిన్ తొలి బ్యాచ్ అందుతుంది. టీకాలు స్వీకరించేందుకు అన్ని రాష్ట్రాలు ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలి."
- కేంద్ర ఆరోగ్యశాఖ
జిల్లాల్లో వ్యాక్సిన్ పంపిణీ.. లబ్ధిదారుల జాబితా ఆధారంగా జరుగుతుందని ఆరోగ్యశాఖ వివరించింది. ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని త్వరలోనే వెల్లడిస్తామని పేర్కొంది.
పుణె నుంచే..
ఈ రోజు లేదా రేపటి నుంచి కొవిడ్ టీకాల రవాణాప్రారంభిస్తామని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ ఇప్పటికే ప్రకటించారు. ప్రయాణికుల విమానాల్లో టీకాలను రవాణా చేయనున్నారు. పుణె కేంద్రంగా దేశవ్యాప్తంగా టీకాలసరఫరా జరగనుంది. దేశవ్యాప్తంగా కొవిడ్ టీకాల పంపిణీకి 41 కేంద్రాలు ఏర్పాటు చేశారు.
కొవిడ్ కట్టడికి భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్, ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా సౌజన్యంతో సీరం ఇన్‌స్టిట్యూట్ తయారు చేసిన కొవిషీల్డ్ టీకాలకు షరతులతో కూడిన అత్యవసర వినియోగానికి ఈ నెల 3న ఆమోదం లభించింది.
- ఇదీ చూడండి: 100కుపైగా విమానాల్లో 2 కోట్ల టీకాలు చేరవేత!