అయోధ్యలోని రామ జన్మభూమి-బాబ్రీ మసీదు స్థల వివాదంపై నేడు సుప్రీం కోర్టు కీలకమైన విచారణ చేపట్టనుంది. రాజకీయంగా సున్నితమైన ఈ కేసులో మధ్యవర్తిత్వంతో నిర్ణయం తీసుకునే వీలుపై తీర్పు వెలువరించనుంది.
కోర్టు నియమిత మధ్యవర్తి ద్వారా నిర్ణయం తీసుకునే వీలుపై మార్చి 6న ఆదేశాలు జారీ చేయనున్నట్లు ఫిబ్రవరి 26న విచారణలో పేర్కొందిసుప్రీం.
ఒక్క శాతం అవకాశం ఉన్నా...
మధ్యవర్తిత్వంతో సమస్య పరిష్కారం పొందే అవకాశాలపై పిటిషనర్లు దృష్టిసారించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి నేతృత్వంలోని ధర్మాసనం సూచించింది. ఈ చర్యలు అన్ని వర్గాల సంబంధాల బలోపేతానికి కృషి చేస్తాయని పేర్కొంది. మధ్యవర్తిత్వంతో వివాద పరిష్కారానికి ఒక్క శాతం అవకాశమున్నా... ఇరు వర్గాలు అటువైపే మొగ్గుచూపాలని తెలిపింది. మధ్యవర్తిత్వంపై ఇరువర్గాల అభిప్రాయాలను కోరిన ధర్మాసనం... మూడో వర్గం జోక్యం అనవసరమని స్పష్టం చేసింది.
వ్యతిరేకించిన హిందూ సంస్థలు
కోర్టు మధ్యవర్తిత్వ సలహాపై కొన్ని ముస్లిం పార్టీలు అంగీకరించాయి. కానీ హిందూ సంస్థలైన రామ్ లల్లా విరజ్మాన్ వంటివి మధ్యవర్తిత్వాన్ని వ్యతిరేకించాయి. గతంలో ఇలాంటి ప్రయత్నాలు విఫలమయ్యాయని పేర్కొన్నాయి.