అటల్ సొరంగ మార్గ నిర్మాణంతో మాజీ ప్రధాని వాజ్‌పేయీ కల సాకారమైందని అన్నారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. ఫిర్ ఫంజల్ పర్వత శ్రేణిలో నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత పొడవైన ఈ సొరంగ మార్గాన్ని ప్రధాని మోదీ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు.
"ఇవాళ చరిత్రాత్మకమైన రోజు. హిమాచల్ ప్రజల దశాబ్దాల ఎదురుచూపులు నేడు ఫలించాయి. సరిహద్దుల్లో ప్రపంచస్థాయి సొరంగమార్గాన్ని నిర్మించాం. వాజ్‌పేయీ స్వప్నాలను మేం సాకారం చేశాం. అటల్ సొరంగ మార్గంతో కోట్లాది మంది స్థానికులకు ప్రయోజనం కలుగుతుంది."
- నరేంద్రమోదీ, ప్రధానమంత్రి
26 ఏళ్ల పనిని ఆరేళ్లలో..
ఈ సొరంగంతో సరిహద్దులకు అదనపు బలం చేకూరుతుందని మోదీ తెలిపారు. సరిహద్దుల్లో మౌలిక వసతుల ఏర్పాటుకు ఈ టన్నెల్ ఎంతో సహకరిస్తుందన్నారు. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి ఈ సొరంగాన్ని పూర్తి చేశారన్న మోదీ.. ఇందుకు పనిచేసిన అధికారులు, ఇంజినీర్లు, సిబ్బందికి అభినందనలు తెలియజేశారు.
"2013-14 నాటికి కేవలం 1,300 మీటర్ల మేర మాత్రమే సొరంగ నిర్మాణం జరిగింది. ఇలాగే కొనసాగితే 2040 నాటికి సొరంగ నిర్మాణం పూర్తవుతుందని నిపుణులు అన్నారు. కానీ మేం అధికారంలోకి వచ్చాక ఎంతో వేగంగా నిర్మించాం. 26 ఏళ్లలో జరగాల్సిన పనిని ఆరేళ్లలో పూర్తి చేశాం. దీని వల్ల ఎంతో సమయం ఆదా అవుతుంది. స్థానిక ప్రజలకు ప్రయాణ దూరం తగ్గుతుంది. హిమాచల్ ప్రజలకే కాకుండా లేహ్-లద్దాఖ్‌లకు కూడా ఈ మార్గం ఎంతో ప్రయోజనకరం."
-నరేంద్రమోదీ, ప్రధానమంత్రి
సరిహద్దుల్లో మౌలిక వసతులపై..
కీలకమైన సరిహద్దు ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన నిర్మాణాలు చేపడుతున్నామని మోదీ తెలిపారు. లద్దాఖ్‌లోని దౌలత్‌బాగ్ ఓల్డీలో మౌలిక వసతులు కల్పించామన్నారు. సరిహద్దుల్లో విమానాలు, హెలికాప్టర్లు దిగేందుకు సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు. సరిహద్దుల్లో రోడ్ల అనుసంధానం అనేది దేశ భద్రతకు ఎంతో కీలకమని స్పష్టం చేశారు.
5 గంటల సమయం ఆదా..
ఈ సొరంగంతో మనాలి- లేహ్ మధ్య దూరం 46 కిలోమీటర్లు తగ్గిపోతుంది. అంతేకాదు దాదాపు 4- 5 గంటల ప్రయాణ సమయం ఆదా అవుతుంది. సైన్యాన్ని వేగంగా సరిహద్దులకు తరలించేందుకు ఇది కీలకం కానుంది. 9.02 కిలోమీటర్ల ఈ సొరంగ మార్గానికి మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ పేరు పెట్టారు. అన్నిరకాల వాతావరణ పరిస్థితుల్ని తట్టుకొనేలా, 80 కిలోమీటర్ల వేగంతో వాహనాలు ప్రయాణించేలా అత్యాధునిక సాంకేతికతతో ఈ సొరంగాన్ని నిర్మించారు.
ఇదీ చూడండి: అద్భుత నిర్మాణం అటల్ టన్నెల్ ప్రత్యేకతలివే..