పోటీ చేసిన తొలి ఎన్నికలో ఓటమి పాలయ్యారు. సోదరుడి మృతితో పార్టీ పగ్గాలు చేపట్టారు. అనూహ్యంగా రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అయ్యారు. ఆ తర్వాత పిన్న వయసులోనే సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఏడాది తిరగక ముందే పదవి పోయినా.. రాజకీయాల్లో పట్టువదలని విక్రమార్కుడిలా పోరాడారు. కాంగ్రెస్-ఆర్జేడీతో జట్టుకట్టి ఝార్ఖండ్‌లో పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చారు. ఆయనే ఝార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) కార్యనిర్వాహక అధ్యక్షుడు, కేంద్ర మాజీ మంత్రి శిబు సోరెన్ తనయుడు హేమంత్ సోరెన్. ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాను ఓడించి రెండోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టబోతున్నారు.
తొలి ఎన్నికల్లో ఓటమి..
శిబు సోరెన్, రూపీ దంపతులకు 1975 ఆగస్టు 10న రామ్‌ఘర్ జిల్లాలో హేమంత్ జన్మించారు. మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తిచేశారని సహచరులు చెప్పినా తన నామినేషన్ పత్రాల్లో మాత్రం ఇంటర్మీడియట్ పూర్తిచేసినట్లు పేర్కొనడం గమనార్హం. 2005లో తొలిసారి దుమ్కా నుంచి ఎన్నికల్లో పోటి చేసిన హేమంత్ పార్టీ రెబల్ అభ్యర్థి స్టీఫెన్ మరాండీ చేతిలో ఓటమి పాలయ్యారు.
38 ఏళ్లకే సీఎంగా బాధ్యతలు
2009లో సోదరుడు దుర్గా మృతితో పార్టీ కీలక బాధ్యతలు చేపట్టాల్సి వచ్చింది. 2009 నుంచి 2010 వరకు రాజ్యసభ సభ్యుడిగా హేమంత్ పనిచేశారు. ఆ తర్వాత అర్జున్ ముండా ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహించారు. అప్పట్లో భాజపా, జేఎంఎం, జేడీయూ, ఏఎస్‌జేయూ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉంది. జేఎంఎం మద్దతు ఉపసంహరించుకోవడం వల్ల రాష్ట్రపతి పాలన విధించాల్సి వచ్చింది. ఆ తర్వాత 2013 జులైలో 38 ఏళ్లకే సీఎంగా బాధ్యతలు చేపట్టారు సోరెన్. 2014 డిసెంబర్ వరకు అధికారంలో ఉన్నారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో భాజపా అధికారంలోకి వచ్చింది.
పాలనలో తనదైన ముద్ర
అధికారంలో ఉన్నది కేవలం 17 నెలలే అయినా పాలనలో తనదైన ముద్ర వేశారు హేమంత్ సోరెన్. ముఖ్యంగా మహిళలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించారు. రాష్ట్రంలో మావోయిస్టు కార్యకలాపాలను అణచివేశారు. అలాగే తాజా ఎన్నికల ప్రచారంలో గిరిజన అనుకూల చట్టాలను తీసుకొస్తామని హామీ ఇచ్చారు. 70 వేల మంది తాత్కాలిక ఉపాధ్యాయులను క్రమబద్ధీకరిస్తామని, మద్య నిషేధం అమలు చేస్తామని ప్రకటించారు. అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ అధికారంలో ఉన్న భాజపాను ఓడించేందుకు కాంగ్రెస్, ఆర్జేడీతో జట్టుకట్టి విజయం సాధించారు.
కొత్త అధ్యాయం లిఖిస్తాం: హేమంత్
జేఎంఎం-కాంగ్రెస్ పార్టీ విజయం అనంతరం హేమంత్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కొత్త అధ్యాయం ప్రారంభమైందన్నారు. ఏ ఆశయాల కోసం ఝార్ఖండ్ రాష్ట్రం ఏర్పడిందో ఆ హామీలు నెరవేరే సమయం ఆసన్నమైందన్నారు. తనకు సహకారం అందించిన లాలూ ప్రసాద్ యాదవ్‌కి, సోనియా, రాహుల్ గాంధీలకు కృతజ్ఞతలు తెలియజేశారు.