తూర్పు లద్దాఖ్‌లో కాల్పుల కలకలంతో సరిహద్దులో ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. అయితే చైనా ఉద్దేశపూర్వకంగానే ఈ దుశ్చర్యకు పాల్పడినట్టు సమాచారం. సోమవారం సాయంత్రం.. ముఖ్పారీ శిఖరం వద్ద 50మంది పీఎల్ఏ సైనికులు.. భారత్ సైనిక స్థావరంవైపు దూసుకొచ్చినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. భారత జవాన్లపై దాడి చేసేందుకు రాడ్లు, కర్రలు, పదునైన ఆయుధాలను చైనీయులు తమ వెంట తీసుకొచ్చినట్టు తెలుస్తోంది.
వ్యూహాత్మక ప్రాంతమైన ముఖ్పారీ నుంచి భారత దళాలను తప్పించేందుకే చైనా ఈ కుట్రకు పాల్పడినట్టు సమాచారం. రెచ్చగొట్టే చర్యలకు పాల్పడవద్దని భారత్ హెచ్చరించినట్టు.. అదే సమయంలో చైనీయులు గాల్లోకి 10-15రౌండ్ల కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది.
చైనా దుశ్చర్యలు కొనసాగుతున్నప్పటికీ.. దక్షిణ పాంగాంగ్ ప్రాంతంలో భారత్ పట్టుకోల్పోలేదని అధికారులు వెల్లడించారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు.