భారత్ నూతన జాతీయ విద్యా విధానాన్ని(ఎన్ఈపీ) అమలు చేయడానికి ప్రపంచంలోని 10 దేశాలు సుముఖత చూపిస్తూ.. తమను సంప్రదించినట్లు కేంద్ర మంత్రి రమేశ్ పోఖ్రియాల్ తెలిపారు. అసోచామ్ నిర్వహించిన 'భవిష్యత్తు విద్య- ఎన్ఈపీ 2020' వెబినార్లో పోఖ్రియల్ ఈ మేరకు వెల్లడించారు.
"ఎన్ఈపీని ఎలా అమలు చేయాలనే దానిపై ప్రభుత్వం సలహాలు తీసుకుంటోంది. ఇప్పటివరకు 15 లక్షల సూచనలు వచ్చాయి. మరిన్ని సలహాలు స్వీకరించడానికి తాము సిద్ధంగా ఉన్నాం" అని పోఖ్రియాల్ తెలిపారు.
అంతర్జాతీయ స్థాయిలో పురోగతి సాధించాలంటే ఆంగ్ల భాష నేర్చుకోవాల్సిన అవసరం ఉందని కొందరు వాదిస్తున్నారని మంత్రి చెప్పారు. అయితే, "ఆంగ్లం భారతీయ భాష కాదని ప్రజలు అర్థం చేసుకోవాలి. జపాన్, రష్యా, ఇజ్రాయెల్, ఫ్రాన్స్, అమెరికా వంటి దేశాలు తమ భాషలో విద్యను అందిస్తున్నాయి. ఆంగ్లం నేర్చుకోకపోతే ప్రపంచ స్థాయిలో పురోగతి సాధించలేమని వాదించే వారికి ఈ విషయాన్ని చెప్పాలనుకున్నాను" అని పోఖ్రియాల్ అన్నారు.
"ఆంగ్ల భాషకు ప్రభుత్వం వ్యతిరేకం కాదు. మాతృభాష విద్యా మాధ్యమంగా ఉంటే భారతీయ భాషలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. ఏ రాష్ట్రంలోనూ ఏదో ఒక భాషను అమలు చేయాలని ప్రభుత్వం భావించడం లేదు. దేశంలోని 22 భాషల అభివృద్ధికి పాటుపడుతూ... అన్నింటినీ బలోపేతం చేయాలనేదే ముఖ్య ఉద్దేశం."
- రమేశ్ పోఖ్రియల్
ఇదీ చూడండి: బిహార్ ఫైట్: ఎన్నికల నగారా మోగిందోచ్..