రాజస్థాన్ శ్రీగంగానగర్‌కు చెందిన 25 ఏళ్ల సునీల్ వాల్మీకి తొమ్మిదో తరగతి చదువుకున్నాడు. ఇంగ్లీష్ పెద్దగా రాదు. పదాలు కొన్ని అర్థమవుతాయి. అమెరికాకు చెందిన 37 ఏళ్ల టెమ్మీ... భర్త రాబర్ట్ కుక్కు 2011లో విడాకులిచ్చి ఒంటరిగా జీవనం సాగిస్తోంది.
వీరిద్దరికీ ఇన్‌స్టాగ్రామ్‌లో స్నేహం కుదిరింది. అది కాస్తా ప్రేమగా మారింది. దాదాపు ఏడాదిపాటు వీరిద్దరి మధ్య ప్రేమాయాణం నడిచింది. ఒకరి కోసం ఒకరు ఏమైనా చేసేంత స్థాయికి ఆ ప్రేమ చేరింది. ఇక దూరాన్ని తరిమేసి ఇద్దరు ఒక్కటవ్వాలనుకున్నారు.
ఎలాగైనా అమెరికాకు వెళ్లి టెమ్మీని కలవాలనుకున్నాడు సునీల్. కానీ పేదరికం అతని ప్రయాణానికి అడ్డు పడింది. టెమ్మీ తన ప్రియుడి పరిస్థితిని అర్థం చేసుకుంది. టెమ్మీకి మొదటి భర్తతో పుట్టిన కుమారుడిని ఆమె తల్లిదండ్రులు జాన్ ఎడ్వర్డ్ విల్హెల్మ్, లిండా ఇరేన్ స్టోక్స్‌కు అప్పగించి.. తానే స్వయంగా భారత్‌కు వస్తున్నట్టు సందేశం పంపింది. ఇంకేముంది సునీల్ ప్రియసఖిని కలిసే ఆనందంలో మునిగిపోయాడు.
సెప్టెంబరు 11న టెమీ దిల్లీ విమానాశ్రయంలో దిగింది. 14వ తేదీన ఆలయంలో హిందు సంప్రదాయం ప్రకారం వారిద్దరికీ పెళ్లి జరిగింది. చేతుల నిండా గాజులు, గోరింటాకు, నుదుట సింధూరం, భారతీయ వస్త్రధారణలో కళకళాడుతున్న విదేశీ వధువును చూసేందుకు చుట్టుపక్కలవారంతా సునీల్ ఇంటి ముందు బారులు తీరారు.
"చాలా కాలం వరకు మా మధ్య స్నేహం నడిచింది. తర్వాత వాట్సాప్ నంబర్లు ఇచ్చి పుచ్చుకున్నాము. స్నేహం మెల్లగా ప్రేమగా మారింది. అప్పుడే మేము పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. మేమిద్దరం ఏం మాట్లాడుకున్నా.. తను నాకెప్పుడు అబద్ధం చెప్పలేదు. నేను తనకు ఎప్పుడూ అబద్ధం చెప్పలేదు."
-సునీల్, వరుడు
సెప్టెంబర్19న టెమ్మీ తిరిగి అమెరికా వెళ్లిపోతుంది. సునీల్‌ను వీలైనంత త్వరగా తీసుకెళ్లాలని భావిస్తోంది.
ఇదీ చూడండి:ఎంపీకే తప్పని కుల వివక్ష- ఊళ్లోకి రాకుండా అడ్డగింత