హరియాణా అసెంబ్లీ ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకొంది. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ పలు ప్రచార సభల్లో పాల్గొన్నారు. అయితే కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వల్ప అస్వస్థతకు గురికావడం వల్ల హరియాణా ఎన్నికల ప్రచారానికి నేడు దూరంగా ఉన్నారు. ఆయన పాల్గొనాల్సిన మూడు ర్యాలీలను రద్దు చేసుకున్నారు.
సీర్సా నియోజకవర్గంలోని తొహనా, ఫతెహబాద్, ఎల్లెనాబాద్ సహా హిసార్ నియోజకవర్గంలోని నర్నౌండ్లలో జరిగే ఎన్నికల ర్యాలీల్లో ఆయన పాల్గొనాల్సి ఉంది. అయితే అనారోగ్య కారణాలతో అమిత్ షా ఇందులో పాల్గొనలేకపోతున్నారని భాజపా నేతలు తెలిపారు. అమిత్ షా గైర్హాజరైనందున ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ పాల్గొంటారని తెలిపారు. సాయంత్రం నర్నౌండ్ నియోజకవర్గంలో జరిగే ర్యాలీలో పార్టీ సీనియర్ నాయకులు పాల్గొననున్నారు.
తొహనా నియోజకవర్గం నుంచి హరియాణా భాజపా అధ్యక్షుడు సుభాష్ బరాలా, నార్నౌండ్ నియోజకవర్గం నుంచి అభిమన్యు సింగ్ సింధు పోటీ చేస్తున్నారు. అందువల్ల భాజపా శ్రేణులు ఈ నియోజకవర్గాలను ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్నాయి.