అభిశంసన గ్రహణం వీడిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలిసారి చేపట్టనున్న భారత్ పర్యటనకు పూర్వరంగం వడివడిగా సిద్ధమవుతోంది. ఈ నెల చివరి వారంలో ఇండియాలో అడుగిడనున్న ట్రంప్ పర్యటన సందర్భంగా- కొంతకాలంగా తీవ్ర ఒడుదొడుకులకు లోనైన అమెరికా భారత్‌ల ద్వైపాక్షిక వాణిజ్యం తిరిగి గాడిన పడేలా ప్రభావశీల ఒప్పందం కుదరనుందన్న సంకేతాలు వినవస్తున్నాయి.
భౌగోళిక రాజకీయాల్లో ఇండియా క్రియాశీల భూమికను గట్టిగా సమర్థిస్తున్న ట్రంప్ సర్కారు, వాణిజ్యాంశాల విషయానికి వచ్చేసరికి 'అమెరికాకే ప్రాధాన్యం' అంటూ భారీ సుంకాల వడ్డనకు తెరతీయడం తెలిసిందే. అందుకు దీటుగా ఇండియా సైతం స్పందించడంతో వాణిజ్య స్పర్ధ శ్రుతి మించి పాకానపడటం- ఉభయ దేశాలకూ మింగుడు పడనిదే. ఈ నేపథ్యంలో, ట్రంప్ ప్రభుత్వం కోరినట్లుగా వాణిజ్య రాయితీలకు తల ఊపితే దేశీయంగా వ్యవసాయం, పాడి పరిశ్రమ కుదేలైపోతాయన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. వాషింగ్టన్ కోరుతున్నట్లు సుంకాలు, సుంకేతర ప్రతిబంధకాల్ని తొలగించి వారి మొక్కజొన్న, పత్తి, సోయా, గోధుమ, ఎండుఫలాల (నట్స్) ఉత్పాదనలకు దేశీయ మార్కెట్ల తలుపులు బార్లా తెరిస్తే- కోరి కొరివితో తలగోక్కున్నట్లే అవుతుందని రైతు సంఘాలు మొత్తుకొంటున్నాయి. ఒకటో రెండో గేదెలు, ఆవుల్ని పెట్టుకొని పాల వ్యాపారంతో బతుకులీడ్చే 15 కోట్లమంది పాడి రైతులున్న ఇండియా- భారీ సబ్సిడీల దన్నుతో ఎదిగిన అమెరికా పాడి ఉత్పాదనల ధాటి, పోటీకి తట్టుకొని నిలవగలదా- అన్న ప్రశ్న పూర్తిగా సమంజసమైనది.
కచ్చితత్వంతో వ్యవహరించాలి
అమెరికా పత్తి వచ్చిపడితే స్థానికంగా రైతుల బతుకులు దూదిపింజెలు అవుతాయన్న సందేహాలు, జన్యు పరివర్తిత ఉత్పాదనలు దిగుమతి అయితే జీవ భద్రత పరిస్థితేమిటన్న ఆందోళనలు ముమ్మరిస్తున్నాయి. నిరుడు నవంబరులో ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య (ఆర్‌సెప్) వేదికపై భారత్ గళాన్ని బలంగా వినిపించి దేశీయ రైతుల ప్రయోజనాల్ని కాచుకొన్న మోదీ ప్రభుత్వం- అమెరికాతో ఒప్పందం విషయంలోనూ అదే కచ్చితత్వంతో వ్యవహరించాలన్నదే అందరి ఆకాంక్ష!
తాత్కాలిక ఒప్పందాల కోసం ట్రంప్!
'వాణిజ్య యుద్ధాలు మంచివే... సులభంగా గెలవచ్చు'నంటూ దిగుమతి సుంకాల పెంపు ద్వారా చైనా, ఇండియాలతో కయ్యానికి కాలుదువ్విన ట్రంప్- తద్వారా అమెరికా వాణిజ్య లోటును కట్టడి చెయ్యదలిచారు. బీజింగ్, దిల్లీలు సైతం అమెరికా ఉత్పాదనలపై సుంకాలు పెంచేసరికి, దేశీయంగా సెగపెరిగి అమెరికా రైతులే దిక్కుతోచని స్థితిలో పడిపోవడంతో- తాత్కాలిక ఒప్పందాలతో గండం గడిచి గట్టెక్కడానికి ట్రంప్ తాపత్రయపడుతున్నారు! 'ఎన్నో ఏళ్లుగా అమెరికాపై ఇండియా అత్యధిక వాణిజ్య సుంకాలు విధిస్తోంది. అది సుంకాల రాజుగా మారింది' అని ట్రంప్ సర్కారు ఆక్షేపిస్తున్నా 'వాణిజ్య పరిమాణ సగటు' ప్రాతిపదికన భారత్ విధిస్తున్న సుంకాలు పెద్ద ఎక్కువేమీ కాదని మోదీ ప్రభుత్వం చెబుతోంది.
అసమాన పోటీ
ఇండియా వాణిజ్య ప్రతిబంధకాలతో తమ ఎగుమతులు మందగిస్తున్నట్లు అక్కడి పాడి, వైద్య ఉపకరణాల పరిశ్రమలు ఫిర్యాదు చెయ్యడంతో ప్రాధమ్య దేశాల జాబితా (జీఎస్‌పీ)నుంచి భారత్ పేరును నిరుడు జులైలో అమెరికా తొలగించింది. జీఎస్‌పీ పునరుద్ధరణ కోసం ఇండియా పట్టుపడుతున్న తరుణంలో- వెయ్యి కోట్ల డాలర్ల (రూ.71వేల కోట్లు) వాణిజ్య ఒప్పందం కోసం బేరాలు ఆడుతున్న అమెరికా, వైద్య ఉపకరణాలపై ఇప్పటికే పంతం నెగ్గించుకొన్నట్లు వార్తాకథనాలు చాటుతున్నాయి. మామిడి పండ్లు, ద్రాక్ష, దానిమ్మ ఫలాల దిగుమతి నిబంధనల్ని సరళీకరించాలని ఇండియా కోరుతుంటే, ఎకాయెకి 600 కోట్ల డాలర్ల వ్యవసాయోత్పాదనలకు గేట్లు తెరవాలని అమెరికా అభిలషిస్తోంది. పౌల్ట్రీ ఉత్పాదనలపై దిగుమతి సుంకాల్ని తగ్గించి, తమతో కోడి పందేనికి సిద్ధం కావాలని అగ్రరాజ్యం కోరుతోంది. అదే జరిగి అమెరికానుంచి కారు చౌకగా కోడిమాంసం, గుడ్లు దిగుమతి అయితే దేశీయ మార్కెట్లో 40శాతానికి నీళ్లొదులుకోవాల్సి వస్తుందని 2015లోనే వాణిజ్య మంత్రిత్వశాఖ హెచ్చరించింది. ఈ అసమాన పోటీ ఇండియాకెంతో చెరుపు చేస్తుంది!
రైతుల దురవస్థలు ఆయనకు పట్టవు
అమెరికా మొత్తం వాణిజ్య పరిమాణంలో ఇండియాతో ద్వైపాక్షిక వాటా పట్టుమని మూడు శాతమే. గత ఆర్థిక సంవత్సరంలో అమెరికాకు ఇండియా ఎగుమతులు 5240 కోట్ల డాలర్లు; దిగుమతులు 3550కోట్ల డాలర్లు. వాణిజ్య లోటు 1690 కోట్ల డాలర్లకు దిగివచ్చినా, ఇండియా భారీ మార్కెట్టును ఒడిసిపట్టి కాసుల పంట పండించుకోవాలనుకొంటున్న ట్రంప్ సర్కారుకు- ఇక్కడి రైతుల దురవస్థలు ఏమాత్రం పట్టవు. 'పండిన పూటే పండగ' అనుకొనేపాటి సాంత్వనకూ నోచని భారతీయ రైతులు ప్రభుత్వాల మద్దతు ధరల మాయాజాలంలో ఒక్క 2016లోనే రెండు లక్షల 65వేల కోట్ల రూపాయలు నష్టపోయినట్లు ఆర్థిక సహకార అభివృద్ధి సంస్థ (ఓఈసీడీ) నివేదికే నిగ్గుతేల్చింది. అదే సంవత్సరం చైనా తన రైతులకు 21200 కోట్ల డాలర్లు, 36 దేశాల కూటమిగా ఓఈసీడీ 23500 కోట్ల డాలర్లు అన్నదాతలకు మద్దతుగా అందించాయి! ఇంత నష్ట జాతకాన్ని నెత్తినమోస్తున్న భారతీయ రైతు పరిస్థితి- అమెరికా వ్యవసాయోత్పాదనలకు రాచబాటలు పరిస్తే అక్షరాలా పెనంమీదనుంచి పొయ్యిలో పడ్డట్లవుతుందనడంలో సందేహం లేదు.
రాజీలేని ధోరణే కర్తవ్యం!
కోడిమాంసం దిగుమతులపై ఇప్పుడు విధిస్తున్న వందశాతం పన్నును అమెరికా కోరుతున్నట్లు 30శాతానికి తగ్గించినా, పాడి ఉత్పాదనల దిగుమతులపై అనుచిత కరుణ చూపినా- వ్యవసాయానుబంధ పరిశ్రమలపైనా అది పిడుగుపాటు అవుతుంది. జాతి జీవన భద్రతకు దన్నుగా నిలుస్తున్న రైతన్నల ప్రయోజనాలపై రాజీలేని ధోరణి కనబరచడమే మోదీ ప్రభుత్వ విహిత కర్తవ్యం కావాలి!
ఇదీ చదవండి: కరోనా టీకా అభివృద్ధిలో భారత సంతతి శాస్త్రవేత్త