భారత్-చైనా సరిహద్దు వివాదానికి ఇంకా పూర్తిస్థాయిలో తెరపడనప్పటికీ 255కి.మీ మేర ఉన్న వ్యూహాత్మక డీఎస్డీబీఓ రోడ్డు నిర్మాణాన్ని ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేయాలని భావిస్తోంది కేంద్రం. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి కావచ్చినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. పర్వత ప్రాంతంలో నిర్మించబోయే దర్బుక్-శ్యోక్-దౌలత్ బేక్ ఓల్డీ రోడ్డు కోసం ప్రత్యేకంగా ఝార్ఖండ్ నుంచి కూలీలను లద్దాఖ్ తీసుకొచ్చినట్లు పేర్కొన్నాయి. వీరికి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు స్పష్టం చేశాయి.
ఈ వ్యూహాత్మక రోడ్డు ద్వారా లేహ్ నుంచి దౌలత్ బేగ్ ఓల్డీకి చేరుకునేందుకు భద్రతా దళాలకు ఆరు గంటలు మాత్రమే పడుతోంది. గతంలో చాలా ఎక్కువ సమయం పట్టేది. తూర్పు లద్దాఖ్‌లో ఈ రోడ్డు నిర్మాణానికి ఇరుకైన ప్రదేశంలో పనిచేయాల్సి ఉంటుంది. చలి తీవ్రత ఎక్కువగా ఉండే కారణంగా అక్కడ నాలుగైదు నెలలు మాత్రమే నిర్మాణం చేపట్టవచ్చు. ఈ వాతావరణ పరిస్థితులను తట్టుకోగల ఝార్ఖండ్ కూలీలను ఇప్పటికే అక్కడికి పంపినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.
రెండు దశాబ్దాల నుంచి
ఈ రోడ్డు నిర్మాణం తలపెట్టి రెండు దశాబ్దాలపైనే కావస్తోంది. 2014లో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దీనిపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ రోడ్డును అనుకున్న సమయంలో పూర్తి చేసేందుకు సంబంధిత అధికారులు సమన్వయంతో పని చేస్తున్నారు.
గాల్వన్ ప్రాంతంలోని పెట్రోలింగ్ పాయింట్ 14, శ్యోక్ నదీ ప్రాంతాన్ని కలిపే వంతెన నిర్మాణానికి ఈ వ్యూహాత్మక రోడ్డుతోనే సంబంధముంది.
తూర్పు లద్దాఖ్‌లోని వాస్తవాధీన రేఖ వెంబడి చైనా భారీగా బలగాలను మోహరించిన అనంతరం సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చైనాకు దీటుగా భారత్ కూడా బలగాలను మోహరించింది. వివాదాన్ని పరిష్కరించేందుకు ఇరు దేశాలు దౌత్య, సైనిక స్థాయి చర్చలు జరుపుతున్నాయి.