చాలామంది భూమిపైనే సొంత స్థలం కొనలేక ఇబ్బంది పడుతూంటే ఓ వ్యక్తి చంద్రుడి మీద ఏకంగా మూడెకరాలు కొని తన భార్యకు బహుమతిగా ఇచ్చాడు. వారి పెళ్లిరోజున చంద్రమండలం తాలూకు రిజిస్ట్రేషన్ కాగితాలు బహూమానంగా ఇవ్వగా ఉబ్బితబ్బిబైపోయింది ఆ ఇల్లాలు. రాజస్థాన్‌లోని జైపూర్‌కి చెందిన ధర్మేంద్ర తన భార్యకు ఇలా పెళ్లిరోజు ఆమె ఊహించని బహుమతి ఇచ్చి ఆశ్చర్యపరిచాడు.


కార్లు, బంగారు ఆభరణాలు కాకుండా ఎప్పటికీ గుర్తుండిపోయే భిన్నమైన ఆలోచన చేయాలనుకున్నా. నా ఎనిమిదవ పెళ్లిరోజైన డిసెంబర్ 24ను ఎంతో ప్రత్యేకంగా జరుపుకోవాలనుకున్నా. సప్న అనిజా కోసం చంద్రమండలంపై మూడెకరాల స్థలాన్ని కొని బహుమతిగా ఇచ్చా. రాజస్థాన్ నుంచి చంద్రుడి మీద భూమి కొనుగోలు చేసిన మొట్టమొదటి వ్యక్తిని అయినందుకు సంతోషంగా ఉన్నా.
-- ధర్మేంద్ర
న్యూయర్క్‌లోని అంతర్జాతీయ లూనా సొసైటీ ద్వారా ధర్మేంద్ర ఈ స్థలాన్ని కొనుగోలు చేశారు. కొనుగోలు వ్యవహరం పూర్తవడానికి సంవత్సరం పట్టింది.



మా పెళ్లి రోజున ఏర్పాటు చేసిన వేడుకల్లో చందమామ సెట్టింగ్ వేసి.. చంద్రమండలం తాలూకూ రిజస్ట్రేషన్ కాగితాలను ఫ్రేము కట్టి నా భర్త నాకు బహూకరించాడు. ఈ ప్రపంచానికి అవతల నాకొక అందమైన బహుమతి ఇచ్చినందుకు చాలా చాలా సంతోషంగా ఉన్నా. నేనెప్పుడూ కలలో కూడా ఊహించని అందమైన బహుమతి ఇది.
--సప్న అనిజా
కొన్ని నెలల క్రితం బిహార్‌కు చెందిన వ్యక్తి తన పుట్టిన రోజున ఒక ఎకరం స్థలాన్ని కొన్నారు. బాలీవుడ్ హీరో షారుక్‌ఖాన్, దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సైతం చంద్రుడిపై ఫ్లాట్లు కొనడం విశేషం.
ఇదీ చదవండి: మరోసారి 'సైంటిస్ట్ ఆఫ్ ది ఇయర్'గా హేమంత్