కరోనా వైరస్ వెలుగు చూసిన నగరం వుహాన్‌లో చిక్కుకున్న భారతీయులను తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమయింది. ఇందుకోసం ప్రత్యేకంగా భారీ విమానాన్ని ముంబయి నుంచి పంపేందుకు ఏర్పాట్లు చేసింది.
దిల్లీలో కేబినెట్ సెక్రటరీ సమావేశంలో చైనాలో ఉన్న భారతీయుల తరలింపుపై తీసుకోవాల్సిన చర్యల గురించి సోమవారం చర్చించారు. విమానం పంపాలని నిర్ణయించారు. భారత విదేశాంగ శాఖ నుంచి ఆదేశాలు రాగానే విమానం బయలుదేరుతుందని తెలుస్తోంది.
"423 మంది కూర్చునే సామర్థ్యం ఉన్న ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 747-400 ముంబయి విమానాశ్రయంలో సిద్ధంగా ఉంది. విదేశాంగ శాఖ నుంచి ఆదేశాలు రాగానే చైనాకు విమానం బయలుదేరుతుంది. వైరస్ వ్యాప్తి చెందిన ప్రదేశానికి సిబ్బందిని తీసుకెళ్లేందుకు ఆరోగ్య శాఖ కూడా ఇందుకు అనుమతి ఇవ్వాల్సి ఉంది."
-ప్రభుత్వ వర్గాలు
వుహాన్‌లో 250 నుంచి 300 వరకు భారతీయులు, ముఖ్యంగా విద్యార్థులు చిక్కుకుపోయారు. వారి ఆరోగ్య పరిస్థితులపై ఆందోళన నెలకొంది.
బీజింగ్‌లోని భారత రాయబారులు వుహాన్ యంత్రాంగంతో కలిసి ఈ అంశంపై సంప్రదింపులు జరిపారు. భారతీయులను తక్షణమే అక్కడి నుంచి తరలించేందుకు అందుబాటులో ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలిపింది భారత రాయబార కార్యాలయం.
ఇదీ చూడండి: మరిన్ని దేశాలకు 'కరోనా'- భారత్‌లో పెరిగిన కేసులు