తమిళ రాజకీయాలు ఎప్పుడూ నాటకీయమే. సినీతారలు, ప్రముఖుల అరంగేట్రంతో ఈసారి జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు మరింత రసవత్తరంగా మారనున్నాయి. అయితే ఇప్పుడు అందరి చూపు అధికార అన్నాడీఎంకే పైనే. తమిళ ప్రజలు 'అమ్మ'గా కొలిచే జయలలిత మరణాంతరం జరుగుతున్న తొలి శాసనభ ఎన్నికలు కావడమే ఇందుకు ప్రధాన కారణం. ఇందుకోసం పార్టీ ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తున్నట్టు కనపడుతోంది. వీటన్నిటి మధ్య ఇప్పుడు చర్చంతా.. భాజపా-అన్నాడీఎంకే 'మైత్రి'పైనే. గత కొంతకాలంగా ఈ మిత్రపక్షాల మధ్య చోటుచేసుకుంటున్న పరిణామాలే ఇందుకు కారణం.
'రాజకీయం' షురూ...
2021 మేలో తమిళనాట శాసనసభ ఎన్నికలు జరిగే అవకాశముంది. ఇందుకోసం అన్ని పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ఇంతకాలం వెనకబడిన నేతలు ఇప్పుడు వేగంగా పావులు కదుపుతున్నారు. సీటు దక్కుతుందని భావిస్తున్న పార్టీలో చేరుతున్నారు. ఎలాంటి హంగూ ఆర్భాటాలు లేకుండా పనికానిచ్చేస్తున్నారు.
అన్నాడీఎంకే కూడా వీటికి మినహాయింపేమీ కాదు. ఇప్పటికే పలువురు కీలక నేతలను పార్టీలో చేర్చుకుంది. అయితే ఇందులో మిత్రపక్షమైన భాజపా నేతలు కూడా ఉండటం గమనార్హం. దీంతో రానున్న ఎన్నికల్లో మిత్రపక్షంతో ముఖ్యమంత్రి పళనిస్వామి తెగదెంపులు చేసుకుంటారనే వాదనలు జోరందుకున్నాయి.
ఇదీ చూడండి:- శశికళను పార్టీకి దూరం చేసేందుకు అన్నాడీఎంకే స్కెచ్!
లోక్‌సభ ఎన్నికల వైఫల్యంతో..
అన్నాడీఎంకే- భాజపా కలిసి 2019 లోక్‌సభ ఎన్నికల్లో బరిలోకి దిగాయి. కానీ ఈ వ్యూహం ఘోరంగా విఫలమైంది. అధికార పార్టీ ఒకే ఒక్క సీటు దక్కించుకోగా.. భాజపా ఖాతా కూడా తెరవలేదు.
అక్కడే అసలు కథ మొదలైంది. ఘోర వైఫల్యం అనంతరం అన్నాడీఎంకే వ్యూహంపై సొంత పార్టీ నుంచే తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. లోక్‌సభలో దారుణ ఓటమికి కారణం భాజపాతో పొత్తుపెట్టుకోవడమేనని బహిరంగంగానే ఆరోపణలు చేశారు. వెంటనే బంధాన్ని తెంచుకోవాలని డిమాండ్ చేశారు. కానీ అది జరగలేదు.
గతేడాది జరిగిన స్థానిక ఎన్నికల్లో.. మిత్రపక్షాల మధ్య విభేదాలు మరోమారు తెరపైకి వచ్చాయి. సీట్ల పంపకం, సహకారం విషయంలో ఈసారి భాజపా నిరాశ చెంది.. అన్నాడీఎంకేపై మండిపడింది. కానీ అప్పుడు కూడా బంధం గట్టెక్కింది.
డిష్యుం..డిష్యుం...
అయితే రానున్నది అత్యంత కీలకమైన శాసనసభ ఎన్నికలు. దీంతో నేతల్లో ఆలోచనలు మారాయి. పార్టీలు మారే ప్రక్రియ మొదలైంది. తాజాగా.. వారం ముందు.. భాజపా జాతీయ కార్యనిర్వాహక సభ్యుడు ఆర్ శ్రీనివాసన్.. ముఖ్యమంత్రి పళనిస్వామిని కలిసి అన్నాడీఎంకే తీర్థం పుచ్చుకున్నారు. అందుకు కొన్ని రోజుల ముందే.. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ మురుగన్‌తో శ్రీనివాసన్ కలిసి ఒకే వేదికను పంచుకోవడం గమనార్హం. ఇది స్థానిక భాజపా నాయకత్వానికి నచ్చలేదు. తమ నేతలతో అన్నాడీఎంకే సంప్రదింపులు జరుపుతోందని భాజపా మండిపడింది.
మరోవైపు.. తమ నిర్ణయాలను భాజపా పలుమార్లు వ్యతిరేకించడం అధికార పార్టీకి రుచించడం లేదు. సమయం వచ్చినప్పుడు భాజపాపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడటానికి పలువురు అన్నాడీఎంకే నేతలు సిద్ధంగా ఉన్నారన్న వార్తలు.. ఇరు పార్టీల మధ్య సంబంధాల పరిస్థితికి అద్ధంపడుతున్నాయి.
ముదిరిన మాటల యుద్ధం...
మిత్రపక్షాల మధ్య మాటల యుద్ధం ఇప్పటికే మొదలైపోయింది. అగ్నికి ఆజ్యం పోసినట్టుగా.. ఇప్పటికే బలహీనంగా మారిన సంబంధాలను మరింత క్లిష్టంగా మారుస్తూ.. అన్నాడీఎంకేపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు భాజపా నేత ఎస్వీ శేఖర్. ఒక అడుగు ముందుకేసి.. అన్నాడీఎంకే పార్టీ దిగ్గజం, మాజీ ముఖ్యమంత్రి సీఎన్ అన్నాదురైనే లక్ష్యంగా చేసుకున్నారు. ఈసారీ అన్నాడీఎంకే అధికారంలోకి రావాలంటే పార్టీ.. అన్నాదురై జపాన్ని విరమించుకోవాలని హితవు పలికారు.
ఇది అధికార పార్టీ సభ్యులను తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. ముఖ్యమంత్రే స్వయంగా శేఖర్‌పై మండిపడ్డారు. 'ఎవరికీ ఉపయోగకరం కాని వ్యక్తిని.. అమ్మ జయలలిత ఆదరించి ఎమ్మెల్యేను చేశారు' అని పళనిస్వామి గుర్తుచేశారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో శేఖర్ ఎక్కడికి వెళ్లిపోయారని ప్రశ్నించారు.
పట్టు కోల్పోతున్న భాజపా...
తమిళనాడులో భాజపా పట్టుకోల్పోతోంది. గత కొంత కాలంగా.. కీలక నేతలు సైతం పార్టీని విడిచిపెట్టి వెళ్లిపోవడం ఆందోళనకర విషయం. శ్రీనివాసన్ అన్నాడీఎంకేలో చేరగా.. భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్కే వేధరతినం డీఎంకే కండువా కప్పుకున్నారు. అదే విధంగా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీటీ అరసకుమార్ కూడా డీఎంకేకు మారారు. భాజపా నాగపట్టణనం జిల్లా కార్యదర్శి అమృత విజయ్‌కుమార్ కూడా డీఎంకే గూటికి చేరారు.
వీటన్నింటికి తోడు.. ప్రస్తుతం పార్టీలో ఉన్న వారు కూడా అసంతృప్తిగా ఉన్నట్టు కనపడుతోంది. తనకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి పదవి ఇవ్వనందుకు నిరాశ చెందినట్టు భాజపాలో అత్యంత కీలక నేత, మాజీ ముఖ్యమంత్రి నైనర్ నాగేంద్రన్ బహిరంగంగానే చెప్పారు.
ఇన్ని సమస్యల్లో భాజపాకు ఓ వెలుగు కనపడింది. డీఎంకే ఎమ్మెల్యే కె.సెల్వన్.. దేశ రాజధాని దిల్లీలో భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డాను కలవడం పార్టీ శ్రేణుల్లో కలవరపాటును కొంతమేర తగ్గించింది. సెల్వన్ భాజపాలో చేరడంపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రానప్పటికీ.. దిల్లీ నుంచి తిరిగొచ్చి వెంటనే చెన్నైలోని భాజపా ప్రధాన కార్యాలయానికి వెళ్లడం అందరికీ తెలిసిన విషయమే.
ఈ ఘటనతో.. అన్నాడీఎంకే, భాజపాతో పాటు రాజకీయ సెగ డీఎంకేకూ తగిలినట్టు స్పష్టమవుతోంది.
భాషపై చిచ్చు...
మాతృభాషకు సంబంధించి తమిళుల తీరే వేరు. ఈ విషయంలో తమపై ఆధిపత్యం చెలాయించాలనుకునే వారికి వ్యతిరేకంగా యావత్ తమిళనాడు ఏకమవుతుంది. ఈ క్రమంలోనే.. కేంద్రం నూతన విద్యా విధానంలో ప్రతిపాదించిన 'మూడు భాషల' ఫార్ములాను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది. ఇది తమపై హిందీని రుద్దడమేనని పళనిస్వామి మండిపడ్డారు. నూతన విద్యా విధానాన్ని పరిశీలించేందుకు ఓ కమిటీని కూడా ఏర్పాటు చేశారు.
ఈ పరిణామాలను చూస్తుంటే.. మిత్రపక్షం మధ్య విభేదాలు రోజురోజుకు ముదురుతున్నాయని.. లోక్‌సభలో ఘోర వైఫల్యం అనంతరం భాజపాతో మరోమారు పొత్తు కుదుర్చుకునేందుకు పళనిస్వామి వర్గం సిద్ధం లేనట్టు స్పష్టంగా తెలుస్తోంది.
ఇదీ చూడండి:- కమల్-రజనీపై అన్నాడీఎంకే 'టామ్ అండ్ జెర్రీ' పంచ్