2014 నుంచి 2018 వరకు ఐదేళ్ల కాలంలో 2,200 మంది కేంద్ర బలగాల(సీఏపీఎఫ్) సిబ్బంది ప్రమాదాలు, ఆత్మహత్యలకు బలైపోయినట్లు జాతీయ నేరాధికార విభాగం(ఎన్ఆర్సీబీ) తెలిపింది. 2018లో 104 మంది సీఏపీఎఫ్ సిబ్బంది ప్రమాదాల్లో మరణించగా.. మరో 28 ఆత్మహత్యలతో కలిపి మొత్తం 132 మంది మరణించారని స్పష్టం చేసింది. సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్), సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్, ఇండో-టిబిట్ సరిహద్దు పోలీసు దళం(ఐటీబీపీ), అసోం రైఫిల్స్(ఏఆర్)తో పాటు సషస్త్ర సీమా బల్(ఎస్ఎస్బీ), ఎన్ఎస్జీ వంటి రక్షణ దళాల సిబ్బందిని ఈ జాబితాలో పరిగణనలోకి తీసుకుంది.
ఏ ఏడాది ఎంతమంది
సీఏపీఎఫ్ సిబ్బంది మరణాలకు సంబంధించి 2014లో తొలిసారి ఎన్ఆర్సీబీ డేటాను సేకరించడం మొదలు పెట్టింది. అదే ఏడాదిలో మొత్తం 1,232 మంది ప్రమాదవశాత్తు మరణించగా.. 175 మంది ఆత్మహత్య చేసుకున్నట్లు నివేదిక వెల్లడించింది. ప్రమాదాల కారణంగా 2017లో 113 మంది, 2016లో 260, 2015లో 193 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆత్మహత్యలతో 2017లో 60 మంది మృతి చెందగా.. 2016లో 74, 2015లో 60 మంది సీఏపీఎఫ్ సిబ్బంది మరణిచినట్లు ఎన్ఆర్సీబీ స్పష్టం చేసింది.
ఒక్కొక్కరికి ఒక్కో సమస్య
2018లో మరణించిన సీఏపీఎఫ్ సిబ్బందిలో 31.7 శాతం మంది విధుల్లో ఉండగానే మరణించినట్లు నివేదిక తెలిపింది. ఆత్మహత్య చేసుకున్న వారిలో 35.7 శాతం మంది కుటుంబసమస్యల కారణంగా మరణించగా.. పెళ్లి సంబంధిత సమస్యల వల్ల 17.9 శాతం ప్రాణాలు కోల్పోయారని పేర్కొంది.
మొత్తం మీద 2018లో 1,34,516 ఆత్మహత్య కేసులు నమోదయ్యాయి. 2017నాటి గణాంకాలు చూస్తే 2018లో 3.6శాతం పెరిగాయి.