కరోనా లాక్‌డౌన్ కారణంగా మూసివేసిన పాఠశాలల పునఃప్రారంభంపై అనిశ్చితి ఏర్పడింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆన్‌లైన్ తరగతులకు హాజరయ్యేందుకు చరవాణులు లేక కొందరు, కరోనాకు భయపడి మరికొంతమంది చదువుకు దూరమవుతున్నారు. పేద విద్యార్థుల బాధలు చూసి చలించిపోయిన ఛత్తీస్గ్ఢ్లో ఓ ఉపాధ్యాయుడు మాత్రం విద్యార్థులకు ఎలాగైనా పాఠాలు చెప్పాలని నిర్ణయించుకున్నాడు.
ఛత్తీస్గఢ్ కొరియా జిల్లాకు చెందిన రుద్రరాణా ప్రభుత్వ పాఠాశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆన్‌లైన్ పాఠాలు ఏర్పాటు చేయగా విద్యార్థులు చాలా తక్కువ సంఖ్యలో హాజరయ్యారు. ఇది గమనించిన రుద్రరాణా 'మొహల్లా పద్ధతి'లో బోధించడం ప్రారంభించారు. విద్యార్థులు పాఠశాలకు రాకుంటే పాఠశాలనే విద్యార్థుల వద్దకు తీసుకెళ్లాలని తలిచారు. అనుకున్నదే తడవుగా తన ద్విచక్ర వాహనంపై ఓ గొడుగు, బోర్డు, ఇతర బోధన సామగ్రిని ఏర్పాటు చేసుకుని బయలుదేరారు. ఉపాధ్యాయుడ్ని చూసిన విద్యార్థులు... పుస్తకాల సంచితో బయటకు వచ్చి భౌతిక దూరం పాటిస్తూ వరండాలో కూర్చుని పాఠాలు వింటున్నారు. విద్యార్థులకు చదువు దూరం కాకుడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నట్లు రుద్రరాణా చెబుతున్నారు.
"ఆన్‌లైన్ తరగతులకు చాలా తక్కువ మంది విద్యార్థులు హాజరయ్యారు. వారి కోసమే నేను ఈ ఆలోచన చేశాను. పాఠశాలకు హాజరుకాలేని వారి కోసం పాఠశాలనే వారి వద్దకు తీసుకువచ్చాను. దీనిపై చిన్న బోర్డు, పుస్తకాలు ఏర్పాటు చేశాను. హిందీ, ఇంగ్లీష్, గణితం పాఠాలను గుర్తించే బొమ్మలను ద్విచక్రవాహనంపై పెట్టాను. ఒకే దగ్గర కాకుండా వీధి వీధి తిరిగి పాఠాలు చెప్పడం వల్ల, విద్యార్థులు భౌతికదూరం పాటిస్తూ కూర్చుంటారు. తద్వారా ఒకరి నుంచి ఒకరికి వైరస్ వ్యాప్తి అయ్యే అవకాశం తక్కువ."
- రుద్రరాణ, ఉపాధ్యాయుడు
ఇదీ చూడండి: ప్రధాని మోదీకి రాహుల్, భాజపా నేతల శుభాకాంక్షలు