నంజన్‌గుడ్‌కు చెందిన వెంకటేశ్ కాశీ విశ్వనాథ్ ఆలయ అర్చకుడు. శనివారం రైల్వే వంతెనపైకి ఎక్కి హల్చల్ చేశాడు. ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నదిలో ఈది అరగంటలో బయటకు వస్తానని సవాలు విసిరాడు. చెప్పినట్టే దూకేశాడు. అందరూ చూస్తుండగానే నదిలో కొట్టుకుపోయి... సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాడు. ఎట్టకేలకు నదిలోకి దూకిన 57 గంటల తర్వాత వెంకటేశ్ ప్రత్యక్షమయ్యాడు.
ఇదివరకే ఓసారి నదిలో అర కిలోమీటరు ఎదురీది బయటకొచ్చాడు వెంకటేశ్. అదే అత్యుత్సాహంతో ఇప్పుడు మరోసారి ప్రయత్నించి... అసలు విషయం తెలుసుకున్నాడు.
"కపిలా నదిపై ఉన్న రైల్వే వంతెన కింద కొన్ని ఫైబర్ డబ్బాలున్నాయి. నేను నదిలో దూకగానే.. నీరు నన్ను డబ్బా లోపలకు తోయడానికి ప్రయత్నించింది. కానీ ఎలాగోలా తెలివిగా నేను అక్కడ నుంచి బయటపడ్డాను. కొంత దూరం ఈదాక నాకు ఓ వంతెన కనిపించింది. ఆ సమయంలో నీరు తాగి ఉంటే నేను చనిపోయి ఉండేవాడిని.
నేను అక్కడి నుంచి ఈదుకుంటూ నీటి నుంచి బయటపడ్డాను. దగ్గర్లో ఓ గుడి కనిపించింది. అక్కడ నేను కొబ్బరి నీళ్లు తాగాను. ఇంతకుముందు కూడా నేను ఇలాంటి సాహసాలు చేశాను. కానీ ఇది భయంకరమైన, ప్రమాదకరమైన ప్రయాణం. యువకులెవరూ ఇలాంటి ప్రయత్నాలు చేయకూడదని కోరుకుంటున్నాను."
-వెంకటేశ్
ప్రమాదకర సాహసం చేసిన వెంకటేశ్‌పై నంజన్‌గుడ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది.
ఇదీ చూడండి:పదేళ్ల తర్వాత కలుసుకున్న తల్లి-తనయుడు