రోజంతా శవపేటికలో ఉండి బతికి బయటపడిన తమిళనాడుకు చెందిన వృద్ధుడు బాలసుబ్రహ్మణియన్ చివరకు మరణించారు. అక్టోబర్ 12న అనేక గంటల పాటు మృతదేహాన్ని భద్రపరిచే రిఫ్రిజిరేటర్‌లోనే ఉన్నారు బాలసుబ్రహ్మణియన్. ఆయన బతికే ఉన్నారని రిఫ్రిజిరేటర్ సంస్థ ప్రతినిధులు గ్రహించి సమాచారం ఇవ్వగా.. పోలీసులకు బాలసుబ్రహ్మణియాన్ని ఆస్పత్రికి తరలించారు. సేలం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. శుక్రవారం తుది శ్వాస విడిచారు.
నిజానికి మృతుడి సోదరుడు శరవణన్... బాలసుబ్రహ్మణియన్పై హత్యాయత్నానికి ఒడిగట్టాడు. సేలం జిల్లా వైద్య శాఖ డిప్యూటీ డైరెక్టర్ మలార్విజి సైతం ఈ ఘటనపై విచారణ చేపట్టగా... అసలు విషయం బయటపడింది. బాలసుబ్రహ్మణియన్ చనిపోయాడని ప్రైవేటు ఆస్పత్రిలోని ఓ వైద్యుడి నుంచి నకిలీ ధ్రువపత్రాన్ని సంపాదించి, రిఫ్రిజిరేటర్ బాక్స్‌లో ఆయనను 20 గంటలపాటు ఉంచాడు శరవణన్.
శవపేటికలో ఉంచిన వ్యక్తి కదులుతున్నాడని ఫ్రీజర్ సంస్థ ప్రతినిధులు గుర్తించినప్పటికీ.. శరవణన్ లెక్కచేయలేదు. ఆత్మ బయటకు వెళ్లిపోతోంది కాబట్టే శవం కదులుతుందని బుకాయించాడు. సమాచారం అందుకున్న పోలీసులు శరవణన్‌పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రైవేటు ఆస్పత్రి యాజమాన్యం నిర్లక్ష్యపు వైఖరిపైనా వైద్యాధికారులు విచారణ చేపట్టారు.
మరో సోదరుడు చంద్రమేలాలీ... బాలసుబ్రహ్మణియన్ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.