ఝార్ఖండ్ అసెంబ్లీకి ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. నలుగురు విపక్ష ఎమ్మెల్యేలను పార్టీలోకి ఆహ్వానించి తమ బలాన్ని మరింత పెంచుకుంది అధికార భాజపా.
ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సుఖ్దేవ్ భగత్, మనోజ్ యాదవ్, ఝార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) నుంచి కునాల్ సారంగి, స్వతంత్ర ఎమ్మెల్యే భాను ప్రతాప్ సాహి భాజపా తీర్థం పుచ్చుకున్నారు. వీరితోపాటు రాష్ట్ర మాజీ డీజీపీ డీకే పాండే కాషాయ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ రాంచీలో కండువా కప్పి వారిని భాజపాలోకి ఆహ్వానించారు.
జేఎంఎంకు చెందిన మరో ఎమ్మెల్యే జైప్రకాశ్ భాయ్ పటేల్ కూడా ఈరోజు కమలదళంలో చేరాల్సి ఉన్నప్పటికీ ఆయన రాలేదని భాజపా వర్గాలు తెలిపాయి.
డిసెంబర్లో ఎన్నికలు..!
82 స్థానాలు కలిగిన ఝార్ఖండ్ రాష్ట్ర ప్రస్తుతం అసెంబ్లీ గడువు ఈ ఏడాది డిసెంబర్లో ముగియనుంది. డిసెంబర్లో లేకా వచ్చే ఏడాది ఆరంభంలో శాసనసభ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.