కరోనా అంతకంతకూ విజృంభిస్తోన్న తరుణంలో దేశం మరో విపత్తును ఎదుర్కోబోతోంది. మరో రెండు రోజుల్లో అంపన్ తుపాను తీరం దాటనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు రెండు సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనేందుకు సిద్ధమైంది జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్).
రెండు విపత్తులను ఎదుర్కొనేందుకు మరో 20 సహాయక బృందాలను ఏర్పాటు చేసింది ఎన్డీఆర్ఎఫ్. మొత్తం 37 బృందాలు పనిచేయనున్నట్లు ఎన్డీఆర్ఎఫ్ డీజీ ఎస్ఎన్ ప్రధాన్ వెల్లడించారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో పూర్తి సన్నద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
"ఎన్డీఆర్ఎఫ్కు చెందిన 37 బృందాలను బంగాల్, ఒడిశాకు తరలించాం. ఇందులో 20 బృందాలు క్రియాశీలకంగా ఉన్నాయి. 17 బృందాలను అవసరానికి ఉపయోగించేలా సిద్ధం చేశాం. కరోనా నేపథ్యంలో ఒకేసారి రెండు సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తోంది."
- ఎస్ఎన్ ప్రధాన్, ఎన్డీఆర్ఎఫ్ డీజీ
ఒక బృందంలో 45 మంది సభ్యులు ఉంటారు. ఒడిశాలో ఏడు, బంగాల్లో 6 జిల్లాలకు బృందాలను తరలించారు. ఇప్పటికే ఈ రెండు రాష్ట్రాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు ప్రధాన్ తెలిపారు.
సూపర్ సైక్లోన్..
అంపన్ తుపాన్ సూపర్ సైక్లోన్‌గా మారే అవకాశముందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం 13 కి.మీ వేగంతో కదులుతున్న ఈ అంపన్.. మే 20 నాటికి బంగాల్లోని దిఘా, బంగ్లాదేశ్‌లోని హతియా ద్వీపాల మధ్య 185 కి.మీ వేగంతో తీరం దాటే అవకాశముందని అంచనా వేసింది.
ఒడిశా పారదీప్‌కు దక్షిణాన 790 కి.మీ, బంగాల్లోని దిఘాకు నైరుతి దిశగా 940 కి.మీ, బంగ్లాదేశ్ ఖేపుపారాకు 1060 కి.మీ దూరంలో అంపన్ కేంద్రీకృతమై ఉందని ఐఎమ్‌డీ పేర్కొంది. ప్రస్తుతం ఇది బంగాల్ తీరం వెంబడి దక్షిణ-నైరుతి దిశగా 13 కి.మీ వేగంతో పయనిస్తోందని తెలిపింది.
ఇదీ చూడండి: సూపర్ సైక్లోన్‌గా మారుతున్న అంపన్