ఉత్తర్ప్రదేశ్లో ఉన్నావ్ అత్యాచార బాధితురాలి మేనల్లుడు (8) కనిపించకుండా పోయిన ఘటనలో చర్యలు చేపట్టారు ఉన్నతాధికారులు. బాధితురాలి కుటుంబానికి భద్రతగా ఏర్పాటు చేసిన ముగ్గురు సిబ్బందిని సస్పెండ్ చేశారు.
లఖ్నవూ రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ లక్ష్మీసింగ్.. శనివారం బాధితురాలి కుటుంబాన్ని కలిసి విచారించారు. వారి నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. ఈ మేరకు గన్మెన్ నరేంద్ర కుమార్, కానిస్టేబుల్ రాజేశ్ కుమార్, మహిళా కానిస్టేబుల్ అనుజ్లను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
" ముగ్గరు పోలీసు సిబ్బంది సస్పెండ్ అయ్యారు. దాంతో పాటు బిహార్ పోలీస్ స్టేషన్లో సెక్షన్ 364 కింద కేసు నమోదైంది. తప్పిపోయిన చిన్నారి కోసం బిహార్, బరసాగ్వార్, పుర్వా, మౌరావాన్, బిఘాపుర్ పోలీస్ స్టేషన్లకు చెందిన బృందాలు గాలింపు చేపట్టాయి. త్వరలోనే బాలుడిని గుర్తిస్తాం. "
- ఆనంద్ కులకర్ణి, ఉన్నావ్ ఎస్పీ
నిందితుల కుటుంబీకులపై ఫిర్యాదు..
రెండు రోజులుగా బాధితురాలి మేనల్లుడు కనిపించటం లేదని.. స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఆమె కుటుంబ సభ్యులు. అత్యాచారానికి పాల్పడ్డ నిందితుల కుటుంబీకులే అపహరించారని ఆరోపించారు. ఫిర్యాదు మేరకు కెప్టెన్ బాజ్పాయ్, సరోజ్ త్రివేది, అనితా, సుందర లోథ్, హర్షిత్ బాజ్పాయ్లపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు పోలీసులు.
2019, డిసెంబర్ 5న తన న్యాయవాదిని కలిసేందుకు వెళుతున్న క్రమంలో అత్యాచార బాధితురాలికి నిప్పుపెట్టారు దుండగులు. దిల్లీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరుసటి రోజున ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
ఇదీ చూడండి: ఉన్నావ్ అత్యాచార బాధితురాలి బంధువు కిడ్నాప్!