పట్టణాల్లో నివాసం వల్ల రోజూ వాహనాల మోత, కాలుష్యం వంటి సమస్యలతో ఇబ్బందులు పడి.. అబ్బా ఒక్కసారైనా ప్రకృతి ఒడిలో హాయిగా సేదతీరాలని భావిస్తున్నారా? నిరంతరం మనుషుల మధ్య ఉండి ఎప్పుడైనా ఇష్టమైన వారితో కబుర్లు చెప్పుకుంటూ ఏకాంతంగా గడపాలని అనుకుంటున్నారా? మీ చెవుల్లో పక్షుల కిలకిల సవ్వడులు, మీ మోమును చల్లటి గాలి తాకుతూ ఉంటే.. ఒక్కసారైనా అలాంటి అనుభూతి పొందాలని ఉందా? అవన్నీ సాధ్యమే. దాని కోసం ఎక్కడో సూదూరాన ఉన్న దేశాలకు పారిపోనవసరం లేదు. భారత్‌లోనే అలాంటి పర్యటక స్థలాలు చాలా ఉన్నాయి.
మనాలి, సిమ్లా, గోవా అయితే ఎప్పుడు సందర్శకులతో రద్దీగా ఉంటాయి. కానీ జనం తక్కువగా ఉండి ప్రశాంతతకు గమ్యస్థానాలపై ఓలుక్కేద్దాం. కరోనాకు దూరంగా, మనసుకు దగ్గరగా గడపొచ్చు. ఒంటరిగా లేదా బృందంగా సాహస యాత్ర చేయాలనుకుంటే ఈ ప్రాంతాలను టిక్కెట్ బుక్ చేసుకోండి. ఆ ప్రదేశాలు ఎక్కడెక్కడ ఉన్నాయంటే..
1. గ్రహణ గ్రామం, హిమాచల్‌ప్రదేశ్
హిమాచల్ ప్రదేశ్.. ఇది సుందరమైన ప్రదేశాలకు పెట్టింది పేరు. ఈ రాష్ట్రంలోనే సిమ్లా, మానాలి వంటి మంచు ప్రదేశాలు ఉన్నారు. వాటికి సందర్శకుల తాకిడి ఎక్కువే. అయితే కోసల్ నుంచి సుమారు 8 కిలోమీటర్ల దూరంలోని ఓ కొండ ప్రాంతం గ్రహణ గ్రామం. అక్కడ అందమైన ప్రదేశాలు మిమ్మల్ని అబ్బురపరుస్తాయి. ఏకాంతతకు ప్రతిరూపంగా ఉన్న ఊ ప్రాంతంలో.. మేఘాలను మీ చేతితో అందుకునే ప్రయత్నమూ చేయొచ్చు.
2. కేదార్కాంతా, ఉత్తరాఖండ్
ఉత్తరాఖండ్‌లోని కేదార్కాంతా అనే ప్రాంతం ఉన్నట్లు కొన్నేళ్లు క్రితం వరకు ఎవరికి తెలియదు. అయితే కొంతమంది ఉత్సాహవంతులైన యాత్రికుల వల్ల ఆలస్యంగా ఇది వెలుగులోకి వచ్చింది. 3,800 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఈ ప్రాంతం నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు మంచుతో కప్పబడి ఉంటుంది. కేదారికాంతా చేరుకోవాలంటే.. దేహ్రాదూన్ నుంచి శంకరీ వరకు క్యాబ్‌లో వెళ్లాలి. అక్కడి నుంచి నడుచుకుంటూ కేదారికాంత్కు చేరుకోవచ్చు.
3. మావ్లినాంగ్, మేఘాలయ
మీరు ప్రకృతిలోని పచ్చదనాన్ని ఆస్వాదించాలంటే మేఘాలయలోని మావ్లినాంగ్కు తప్పక వెళ్లాల్సిందే. ఈ చిన్న గ్రామంలో చెట్ల కొమ్మలతో నిర్మించబడిన వంతెనలు మీరు చూడవచ్చు. ఈ ప్రాంతం షిల్లాంగ్ విమానాశ్రయం నుంచి 118 కిలోమీటర్లు లేదా గువాహటి విమానాశ్రయం నుంచి 190 కి.మీ దూరంలో ఉంటుంది. క్యాబ్ ద్వారా ఈ ప్రాంతానికి చేరుకోవచ్చు.
4.రాధానగర్ బీచ్, అండమాన్ నికోబార్ దీవులు
హావ్‌లాక్ దీవులకు వచ్చినట్లు ఈ బీచ్‌కు ఎక్కువ మంది పర్యటకులు రారు. ఇతర వాణిజ్య బీచ్‌ల మాదిరిగా కాకుండా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడి వాతావరణం. హావ్‌లాక్ నుంచి రాధానగర్ బీచ్‌కు చేరాలంటే 24 కిలోమీటర్లు క్యాబ్ ద్వారా ప్రయాణించాలి. లేదంటే విజయనగర్ బీచ్ నుంచి 7 కిలోమీటర్లు దూరంలో ఈ ప్రాంతం ఉంటుంది. పోర్ట్‌బ్లెయిర్ నుంచి రాధానగర్‌కు సముద్ర మార్గం ద్వారా కూడా వెళ్లవచ్చు. నీలి రంగులో ఉండే సముద్రపు నీరు, మెత్తటి సాగర తీరం మిమ్మల్ని మైమరపిస్తాయి.
5.ధార్చులా, ఉత్తరాఖండ్
ఉత్తరాఖండ్‌లోని ధార్చులా ఆధ్యాత్మికతకు ముఖ్య స్థావరం. మానస సరోవర్ సరస్సు మార్గంలో ఇది ఉంది. భారత్-నేపాల్ సరిహద్దు అయిన పితోరాగఢ్ జిల్లాలో ఈ సుందరమైన ధార్చులా పట్టణం ఉంది. పితోరాగఢ్ నుంచి 83 కిలోమీటర్లు దూరం ప్రయాణిస్తే ఈ ప్రాంతం చేరుకోవచ్చు. విమానంలో పంతంగర్‌కు చేరుకుని, అక్కడ నుంచి క్యాబ్ సాయంతో ధార్చులా వెళ్లొచ్చు.
6.డారింగ్‌బాడి, ఒడిశా
ఒడిశాలోని డారింగ్‌బాడి ప్రాంతాన్ని ఆ రాష్ట్రంలో కశ్మీర్‌గా పిలుచుకుంటారు. శీతకాలంలో మంచు ఎక్కువగా కురవడం, ఉష్ణోగ్రతలు సున్నాకు పడిపోవడం ఇక్కడి ప్రత్యేకత. పచ్చని అడవులు, కాఫీ తోటలు విపరీతంగా ఉంటాయి. బ్రహ్మపూర్ రైల్వే స్టేషన్ నుంచి 120 కిలోమీటర్ల దూరం లేదా భువనేశ్వర్ విమానాశ్రయం నుంచి 245 కిలోమీటర్లు దూరం ప్రయాణించి ఈ ప్రాంతంలో అడుగుపెట్టొచ్చు.
7.రికాంగ్ పియో, హిమాచల్ ప్రదేశ్
హిమాచల్‌ప్రదేశ్‌లో ఉన్న ఒక అద్భుతమైన పట్టణం రికాంగ్ పియో. మీరు దాని పేరును మొదటిసారి వింటున్నారేమో. ఎందుకంటే రెకాంగ్ పియో ఎవ్వరికీ తెలియని నిధి లాంటిది. ఈ పట్టణంలో చంద్రికా ఆలయం, స్పితి నది, ఖాబ్, కల్ప వంటి అద్భుతమైన ఆధ్యాత్మిక, సందర్శనీయ ప్రదేశాలున్నాయి. రైలులో చండీగఢ్ చేరుకొని అక్కడ నుంచి రికాంగ్ పియో పట్టణానికి ఒక ప్రైవేట్ టాక్సీ సాయంతో ఇక్కడకు వెళ్లొచ్చు.
8. ఖిమ్సార్ కనుమలు, రాజస్థాన్
రాజస్థాన్ థార్ ఎడారిలో చిన్న, ప్రశాంతమైన పట్టణం ఖిమ్సార్. ఇది ఇసుక దిబ్బలతో ఉంటుంది. ఎడారి, వన్యప్రాణులను చూడటానికి సరైన ప్రదేశం. ఇక్కడ నుంచి సుమారు 6 కిలోమీటర్లు వెళ్తే ఈ కనుమలు కనువిందు చేస్తాయి. ఒయాసిస్‌లను చూడాలన్నా, అక్కడ సరదాగా సేదతీరాలన్నా ఇక్కడ సాధ్యం. ఒంటెపై ప్రయాణం చేసి ఎడారిలో చక్కర్లు కొట్టొచ్చు.
9. ఫుగ్తాల్ మొనాస్టరీ, లద్దాఖ్
ఫుగ్తాల్ మొనాస్టరీ.. లద్దాఖ్‌లోని ఒక భారీ మఠం. ఇది పర్వతాలలో తేనెగూడు నిర్మాణంలా ఉంటుంది. దీనిని 12వ శతాబ్దంలో నిర్మించారు. ఇక్కడ ప్రస్తుతం 70 మంది సన్యాసులు నివసిస్తున్నారు. ఈ ప్రాంతం చేరుకోవడానికి హిమాచల్‌ప్రదేశ్ దార్చా నుంచి క్యాబ్ ద్వారా వెళ్లవచ్చు లేదా ఐచెర్ నుంచి అన్ము, చా మార్గం గుండా ట్రెక్కింగ్ సదుపాయం ఉంది.
10. గండికోట, ఆంధ్రప్రదేశ్
వేల సంవత్సరాల నుంచి పారుతున్న పెన్నానది ఆవిష్కరించిన దృశ్యకావ్యం గండికోట. పెద్ద పర్వాతాన్ని రెండుగా చీల్చి, మధ్యలో వంపులు తిరుగుతూ ప్రవహించే నది తీరు అపురూపం. అందుకే గండికోటను భారత గ్రాండ్ కెన్యాన్.. ఆరిజోనా ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. కడప జిల్లా జమ్మలమడుగుకు 17 కి.మీ దూరంలో ఉంది. ప్రకృతి చిత్రాలతో పాటు చారిత్రక, సాంస్కృతిక సంపదను కళ్లకు కడుతుంది. కోటలో నుంచి చూస్తే సూర్యోదయం, కొండల వెనుక దాక్కుంటున్న సూర్యాస్తమయం మనల్ని ఉత్తజితుల్ని చేస్తాయి. ఇక్కడకు వెళ్లేందుకు రైలు, విమాన రోడ్డు ప్రయాణ వసతులున్నాయి. కడప నుంచి 77 కి.మీ దూరంలో ఈ ప్రాంతం ఉంది. చైన్నై-ముంబయి ప్రధాన రైలు మార్గంలో ఇది ఉంది. గుత్తి, గుంతకల్లు జంక్షన్ల నుంచి వెళ్లే రైళ్లలో ముద్దనూరు దగ్గర దిగాలి. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో 26 కి.మీ ప్రయాణిస్తే గండికోటకు చేరుకోవచ్చు.